Doctors Strike: ఏపీలో( Andhra Pradesh) నేటి నుంచి వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేతకు పిలుపునిచ్చింది ఆంధ్ర ప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈరోజు నుంచి పీహెచ్సీలలో ఓపి సేవలో నిలిపివేస్తామని ప్రకటించారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే దశలవారీగా ఇతర సేవలను సైతం నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రధానంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యులు సేవలు నిలిపివేస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.
సమస్యల పరిష్కారానికి..
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో( government hospitals) పని చేస్తున్న వైద్యులు గత కొద్దిరోజులుగా కోరుతూ వచ్చారు. జీవో 99 ద్వారా తగ్గించిన ఇన్ సర్వీస్ పీజీ కోటాను తిరిగి ఇవ్వాలని, ప్రమోషన్లు కల్పించాలని, 104 సంచార చికిత్స అలవెన్సులు, నేషనల్ ఇంక్రిమెంట్లు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి 50 శాతం ప్రాథమిక వేతనాన్ని గిరిజన భత్యంగా ఇవ్వాలని డాక్టర్ల సంఘం డిమాండ్ చేస్తూ వస్తోంది. అయితే ఈ డిమాండ్లతోనే ఇప్పటికే వైద్య శిబిరాలతో పాటు సంచార సేవలను సైతం బహిష్కరించారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు స్పందించకపోతే.. ఈనెల 30, అక్టోబర్ 1, రెండు తేదీల్లో జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, దీక్షలు చేపడతామంటున్నారు. అక్టోబర్ మూడున విజయవాడలో రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీ వైద్యులతో పెద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ రోజు నుంచి నిరవధిక దీక్షలు కూడా మొదలు పెట్టనున్నారు.
ఇప్పటికే కొన్ని విధుల బహిష్కరణ..
అయితే ఇప్పటికే శాఖా పరమైన విధుల బహిష్కరణలో ఉన్నారు ప్రభుత్వ వైద్యులు( government doctors ). పీహెచ్సీలకు ఆన్లైన్లో నివేదికలు పంపడం ఇప్పటికే మానేశారు. అధికారిక వాట్సాప్ గ్రూప్ లను కూడా బహిష్కరించారు. వైద్య శిబిరాలతో పాటు సంచార సేవలకు దూరంగా ఉంటున్నారు. ఈ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కు ఇప్పటికే అందించారు ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్ల సంఘం ప్రతినిధులు. అయితే అత్యవసర విభాగం కావడంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లేందుకు వీలులేదని… అవసరం అనుకుంటే ఏస్మా ప్రయోగానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది.
అత్యవసర విభాగం కావడంతో..
ఏపీ సివిల్ సర్వీసెస్ నియమావళి, అత్యవసర సేవల నిర్వహణ చట్టం ప్రకారం సమ్మెలు, సమ్మె నోటీసులు ఇవ్వడం నిషేధం. అత్యవసరమైన వైద్య సేవలకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే అది సర్వీసు నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుంది. ఎస్మా ప్రకారం అది శిక్షించదగ్గ నేరం కూడా. అందుకే ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతూనే.. ఎస్మా ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతోంది. ప్రస్తుతం వర్షాలు పడుతున్న దృష్ట్యా రోగాలు ప్రబులుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సమ్మె చేయడం తగదని ప్రభుత్వం చెబుతోంది. మరి దీనిపై ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.