AP Budget 2024: ఏపీ అసెంబ్లీలో బుగ్గన బడ్జెట్.. ఐదేళ్ల ప్రగతి ఏకరవు!

సూక్ష్మ నీటిపారుదల పద్ధతి, చేపల ఉత్పత్తి, ఆక్వా రంగానికి ప్రోత్సాహం, జాతీయ ఆహార భద్రత చట్టం అమలు వంటి విషయంలో ఏపీ ముందున్న విషయాన్ని బుగ్గన ప్రస్తావించారు.

Written By: Dharma, Updated On : February 7, 2024 5:06 pm
Follow us on

AP Budget 2024: ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖ మంత్రిగా వరుసగా ఐదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టగలిగారు. ఈ సందర్భంగా ఆయన గత ఐదేళ్ల పాటు ఆర్థిక ప్రగతి, కేంద్రం నుంచి సాధించిన నిధులను గణాంకాలు, ఉదాహరణలతో వివరించే ప్రయత్నం చేశారు. ఐదేళ్ల వైసిపి పాలనలో ఏపీ ఆర్థిక ప్రగతి సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. 2018- 19 లో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో ఉండగా, 2023 నాటికి 16.2 శాతానికి పెరగడంతో జాతీయస్థాయిలో 4వ స్థానానికి చేరుకున్నట్లు ప్రకటించారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానం అందుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అటు వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు 2019లో 8.3%తో 12వ స్థానంలో ఉండగా.. ఈరోజు 13 శాతం వృద్ధిరేటుతో ఆరో స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సమూల మార్పులు, ప్రజోపయోగ పథకాలు తీసుకొచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందని తేల్చి చెప్పారు. దేశంలో ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ అని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల 6 వేల మంది రైతులకు సేవలు అందిస్తూ మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకు ప్రశంసలు అందుకున్నాయని చెప్పుకొచ్చారు. విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రభుత్వం అందిస్తున్న భరోసాను చూసి దేశంలో మిగతా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పారు.

సూక్ష్మ నీటిపారుదల పద్ధతి, చేపల ఉత్పత్తి, ఆక్వా రంగానికి ప్రోత్సాహం, జాతీయ ఆహార భద్రత చట్టం అమలు వంటి విషయంలో ఏపీ ముందున్న విషయాన్ని బుగ్గన ప్రస్తావించారు. మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, అదాని, లారెన్స్ సింథసిస్, టిసిఎస్, ఇన్ఫోసిస్, హీరో మోటో కార్ప్, యోకహామా, గ్రాసిం ఇండస్ట్రీస్, గ్రీన్ కో ఎనర్జీ వంటి దిగ్గజ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుబడి పెట్టాయని చెప్పారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి వైసీపీ సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేసిందని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించడం విశేషం.

అయితే ఈ బడ్జెట్ కేటాయింపులతో పాటు గత ఐదేళ్లుగా చేపట్టిన ప్రగతి గురించి ఆర్థిక మంత్రి చెప్పిన విధానాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధి తిరోగమన దిశలో ఉంటే.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం అభివృద్ధి సూచిక ప్రగతిపధం వైపు దూసుకెళ్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు వైసీపీ సర్కార్ ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు.