
Andhra Pradesh: మనిషి తన మేథోశక్తితో పక్షిలా ఎగరడం నేర్చుకున్నాడు. నీటిలో చేపలా ఈదడం తెలుసుకున్నాడు. కానీ భూమి మీద మాత్రం మనిషిలా బతకడం మరిచిపోయాడు. మనిషిలో కూడా రాక్షసుడు ఉంటాడని పురాణాల్లో తెలుసుకున్నాం. కంటికి రెప్ప కాపలా అని తెలుసు. కానీ కన్న తండ్రులే కాలయముల్లా కనిపించడం దారుణం. కన్నతండ్రుల్లా ఉంటూ కన్న బిడ్డల శీలాలను హరించడం చూస్తుంటే మన నాగరికత ఎక్కడికి పోతోందో అర్థమవుతోంది. మనుషులను చూస్తే బాగా చదువుకున్న వారే కానీ వారి చేష్టలే నీచంగా ఉన్నాయి. కన్న బిడ్డల మానాన్ని దోచుకునే దుర్మార్గులను ఏ విధంగా శిక్షించాలి. ఎందుకు మానవ సమాజంలో ఉంచాలి.
విజయవాడలో మొన్న ఓ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేసే వ్యక్తి భార్య ఇంట్లో లేని సమయంలో తన ఐదేళ్ల కూతురుపై అత్యాచారం చేసిన ఘటన మరువకముందే తాజాగా మరో కీచక తండ్రి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న 35 ఏళ్ల వ్యక్తి వృత్తి రీత్యా ఫిజియోథెరపిస్ట్, అతడికి 13 సంవత్సరాల కూతురు, 11 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. గత ఏడాది మార్చి నుంచి కన్న తండ్రి కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.
కుమార్తెకు కాపలాగా ఉండాల్సిన తండ్రే తన శీలాన్ని దోచుకోవడంతో బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. జరిగిన ఘోరానికి తట్టుకోలేక నానమ్మ ఇంటికి వెళ్లి రోదించింది. ఇద్దరు కలిసి పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తున్న వ్యక్తి కన్న బిడ్డ పైనే దుర్మార్గంగా వ్యవవహరించడం సంచలనంగా మారింది.
సమాజంలో బాగా చదువుకున్న వారే ఈ విధంగా దారుణాలు చేయడంతో అందరిలో ఆశ్చర్యం వేస్తోంది. అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏ మేరకు ఫలితాలు ఇస్తున్నాయో ఈ తరహా ఘటనలు చూస్తుంటేనే తెలుస్తోంది. కంటికి రెప్పలా ఉండాల్సిన తండ్రులే కర్కశంగా మారడం చూస్తుంటే శిక్షలు కూడా ఏం చేయలేకపోతున్నాయని తెలుస్తోంది. ఎంత కఠిన చట్టాలు వచ్చినా కీచకుల కథలు మాత్రం ఆగడం లేదు.