Chittoor News : ఏపీ సర్కారు తీరు కోడిగుడ్డుపై ఈకలు పీకిన చందంగా మారింది. ప్రజలు, బాధితులు సర్కారుకు పట్టడం లేదు. అస్మదీయులకు అయాచిత లబ్ధి చేకూర్చుతున్నా.. ప్రభుత్వ బాధిత వర్గాలకు మాత్రం రూపాయి చెల్లించడం లేదు. చెల్లించడానికి మనసు రావడం లేదు. ప్రభుత్వమంటే ప్రజా సమూహమని అటు న్యాయస్థానాలు, ఇటు మానవ హక్కుల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఖరీదైన లాయర్లతో వాదనకు దిగుతుందే తప్ప.. ఆ వకీలు ఫీజుతో బాధిత కుటుంబానికి న్యాయం చేయవచ్చన్న భావన ఇసుమంత కూడా కనిపించడం లేదు. ఇటువంటి కేసుల్లో ఏపీ ప్రభుత్వ తీరును చూసి న్యాయమూర్తులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.అంగన్ వాడీ స్కూల్ కు వెళ్లిన చిన్నారి అక్కడ పెట్టిన గుడ్డు తిని అస్వస్థతకు గురై కాసేపటికే చనిపోయింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని తేల్చి హెచ్‌ఆర్సీ పరిహారం ఇవ్వమంది. అయితే తాము చెల్లించే ప్రశ్నే లేదని అది గాడ్ ఆఫ్ యాక్ట్ అని వాదిస్తూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది.
గత ఫిబ్రవరిలో చిన్నారిమృతి..
గత ఏడాది ఫిబ్రవరి 17న చిత్తూరు జిల్లా కుప్పం మండలం, గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఓ ఘటన చోటుచేసుకుంది. దీక్షిత అనే చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కోడి గుడ్డు గొంతులో ఇరుక్కుపోయి..ఊపిరాడక దీక్షిత కన్నుమూసింది. అయితే అంగన్ వాడీ సిబ్బంది తీరుతోనే పాప మృతిచెందిందని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కానీ అంగన్వాడీ సిబ్బంది మాత్రం పాప అనారోగ్యంతో మృతిచెందిందని… తమ తప్పులేదని చెప్పుకొచ్చారు. దీంతో తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. దీనిపై హెచ్ఆర్సీ నాలుగు నెలల తరువాత స్పందించింది. దీంతో ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం చేశారు.
హెచ్ఆర్సీ ఆదేశించినా..
అయితే కోడిగుడ్లు గొంతులో ఇరుక్కుపోవడం వల్లే దీక్షిత చనిపోయిందని పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో మానవహక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. పరిహారం కింద రూ.8 లక్షలు చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ ఏడాది జనవరి 31న ఆదేశాలవ్వగా.. ఏపీ సర్కారు పట్టించుకోలేదు .. సరికదా తిరిగి హైకోర్టులో కేసు వేసింది. తన కర్కశాన్ని చాటుకుంది. చిన్నారిని కోల్పోయింది ఆ పేద తల్లిదండ్రులు. కానీ ప్రభుత్వం మాత్రం వారిని దయతో చూడడం లేదు. ప్రత్యర్థులుగానే చూస్తోంది. పోనీ ప్రభుత్వమే నేరుగా వచ్చి కోర్టులో నిలబడుతుందా? అంటే అదీ లేదు. ప్రభుత్వం తరుపున వాదించే లాయర్లకు రూ. లక్షలు ముట్టజెప్పుతోంది. అదే నగదును బాధిత కుటుంబానికి అందిస్తే స్వాంతన చేకూరేది. కోర్టు కేసులు ఉండేవి కావు. మరి పాలకులు సంకుచిత భావాలు కలిగిన వారైతే ఇటువంటి పరిస్థితే ఎదురవుతోంది. ఇప్పుడు హైకోర్టులో దాఖలైన ఈ కేసు వైరల్ అవుతోంది. ప్రభుత్వం విమర్శలు పాలవుతోంది.