AP Assembly Winter Session: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చకు వస్తోంది. వచ్చే నెలలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. అయితే నిబంధనల మేరకు సభ్యులు పని దినాల్లో 60 రోజుల వ్యవధిలో సభకు హాజరు కాకుంటే అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన వైసీపీ సభ్యులపై వేటు వేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్పీకర్ అయ్యన్న పాత్రుడు తో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈ విషయంపై పలుమార్లు మాట్లాడారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పించి మిగతావారు జీతభత్యాలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. కొందరైతే జీతాలతో పాటు ఇతర రాయితీలు సైతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సభకు ఈసారైనా వైసీపీ సభ్యులు వస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్ అవుతోంది.
* కెసిఆర్ మాదిరిగా..
మొన్న మధ్యన తెలంగాణ( Telangana) అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. సభకు వచ్చి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతారని గులాబీ పార్టీ నేతలు ఆర్భాటం చేశారు. కానీ వరుసగా 60 పని దినాల్లో ఒకసారి హాజరు కాకుంటే మాత్రం అనర్హత వేటుపడే అవకాశం ఉంది. అందుకే సభకు వచ్చిన కేసీఆర్ రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్లిపోయారు. అయితే దానిని ఫాలో అయ్యే అవకాశం ఏపీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే కానీ సభకు హాజరు కాబోనని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అందుకే ఆయన సభకు హాజరు కారు అని తెలుస్తోంది. అయితే మిగితా ఎమ్మెల్యేలైనా హాజరవుతారా అనేది అనుమానమే. అయితే వారి విషయంలో స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
* వారి విషయంలో చర్చ..
మొన్ననే అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ( assembly ethics committee ) సమావేశం జరిగింది. చైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైసిపి ఎమ్మెల్యేల తీరుపై చర్చించారు. అయితే కొంతమంది సభకు హాజరు కాకుండానే రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి విషయంలో సభలో ఈసారి చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఒకవేళ ఉమ్మడిగా 11 మంది సభ్యులపై చర్యలు తీసుకోవాలి అంటే.. న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్పీకర్ అదే పనిలో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే సభకు హాజరు విషయంలో జగన్మోహన్ రెడ్డి పై వైసీపీ నుంచి ఒత్తిడి ఉంది. కానీ సభకు హాజరైతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన హాజరయ్యేందుకు ఇష్టపడటం లేదట. మొత్తానికి అయితే ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.
