AP New Districts 2025: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఒకవైపు పాలనాపరమైన వైఫల్యాలను సరిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను అధిగమించి మెరుగైన పాలన వైపు అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా జిల్లాలపై దృష్టి పెట్టింది. అన్ని జిల్లాల సరిహద్దులను పునర్వ్యవస్థీకరించడానికి రంగం సిద్ధం చేసింది. వాటికి కొత్త పేర్లు పెట్టనుంది. కొత్త సరిహద్దులను నిర్ధారించనుంది. దీనికోసం మంత్రుల బృందం ఏర్పాటయింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, ఆర్ అండ్ బి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తదితరులతో కూడిన కమిటీ దీనిపై అధ్యయనం చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జీవో కూడా జారీ చేశారు.
Also Read: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
మంత్రుల బృందం ఏర్పాటు..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలు ఉన్నాయి. ఈ మనుగడలో ఉన్న జిల్లాల పేర్ల మార్పుపై అధ్యయనం చేస్తుంది ఈ మంత్రుల బృందం. ప్రాంతీయ పరిస్థితులు, అక్కడి చరిత్రకు అనుగుణంగా కొత్త పేర్లు పెట్టి అవకాశాలను పరిశీలిస్తోంది కూటమి ప్రభుత్వం. జిల్లా, రెవెన్యూ డివిజనల్( revenue divisional ), మండల సరిహద్దులపై కూడా అధ్యయనం చేయనుంది. దీంతోపాటు జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్, మండల కేంద్రానికి ఆయా గ్రామాల మధ్య దూరాన్ని కూడా అంచనా వేయనుంది ఈ బృందం. దీనికి అనుగుణంగా జిల్లా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వైసిపి హయాంలో కొత్త జిల్లాలు..
వైసీపీ( YSR Congress ) హయాంలో ఉమ్మడి 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. అయితే జిల్లాల విభజనలో హేతుబద్ధత లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా జిల్లాలను అడ్డగోలుగా విభజించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కనీసం అప్పట్లో ప్రతిపక్షాల అభిప్రాయం కూడా సేకరించలేదు. ప్రజాభిప్రాయం కూడా సహకరించలేదు. అందుకే ఇప్పుడు జిల్లాల విభజనకు సంబంధించి మంత్రుల బృందాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందం నేరుగా ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల నుంచి కూడా వినతులు స్వీకరించనుంది. అందరి అభిప్రాయాలను తీసుకున్నాక ఒక నిర్ణయానికి రానుంది. మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. దానికి అనుగుణంగా జిల్లాల పేర్లు మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటు పై కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read: ఆడవాళ్లకు నెలకు రూ.1500 ఇవ్వాలంటే ఆంధ్రానే అమ్మాలట?
ఆ హామీ మేరకు..
అయితే తాము అధికారంలోకి వస్తే కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడ అని ఆ ప్రాంతీయులు ఎదురుచూస్తున్నారు. మంత్రుల పర్యటన సమయంలో దీని పైనే ఎక్కువగా వినతులు వస్తున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. అన్ని కుదిరితే వచ్చే సంక్రాంతి నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..