Ananda Raju Vegesna Passes Away: రాజు ఎక్కడున్నా రాజే. బాహుబలి( Baahubali ) సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్ ఇది. నిజజీవితంలో కూడా ఎంతోమంది రాజులు అనిపించుకున్నారు. అటువంటి వారే వేగేశ్న ఆనందరాజు. ఆయన దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజు వేగేశ్న ఫౌండేషన్ ద్వారా ఆధ్యాత్మిక సేవలు చేశారు. అనేక దేవాలయాలకు సహాయం చేశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించారు. తిరుమలలో అన్నదాన సత్రం, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. షిరిడీలో నీటి ప్లాంట్, తిరుపతి, ద్వారకాతిరుమలలో ఆసుపత్రులు నిర్మించారు. పేద పిల్లల చదువుకు సహాయం చేశారు. అటువంటి వేగేశ్న ఆనంద్ గజపతిరాజు కన్నుమూశారు. ఆదివారం ఆయన విశాఖలో తుది శ్వాస విడిచారు.
పశ్చిమగోదావరి జిల్లా వాసి
విశాఖలో స్థిరపడిన ఆనందరాజు( Anand Raj ) స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని గణపవరం. 1979లో విశాఖకు ఆయన వచ్చారు. వ్యాపార రంగంలో రాణించారు. గత పది సంవత్సరాలుగా రాజు వేగ్నేశ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఒకటి కాదు రెండు కాదు 100 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం లో భక్తుల సౌకర్యార్థం అనేక వసతులు కల్పించారు ఆనంద రాజు.
Also Read: ఢిల్లీ పాలిటిక్స్ సరే.. గల్లీ మాట ఏంటి? బైరెడ్డి శబరికి ఏం కష్టం!
ఆలయాలకు దాతృత్వం
ఆనందరాజు వేగేశ్న ఫౌండేషన్( Vegesna Foundation ) ద్వారా తిరుమల లో 77 కోట్ల రూపాయలతో అన్నదాన సత్రం కట్టించారు. 27 కోట్లతో వాటర్ ప్యూరిఫై చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ప్లాంట్ నిర్వహణ కోసం ఏటా కోటి 50 లక్షల రూపాయల మేర విరాళం ఇచ్చేవారు. షిరిడీ లో కూడా నీటి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆనంద రాజు తెలంగాణలోని ఆలయాలకు సైతం సాయం అందించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి 25 కోట్ల రూపాయలతో అన్నదాన సత్రం నిర్మించారు. దేవాలయాల వద్ద బస్టాండ్లు రైల్వేస్టేషన్లో ఎన్నో సౌకర్యాలు కల్పించిన ఘనత ఆయనదే. విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీ, ద్వారకా బస్టాండ్ దగ్గర ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎంతోమంది పేద పిల్లల చదువుకు కూడా సాయం చేశారు. ఆయన అకాల మృతి పై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 64 సంవత్సరాల వయసులో మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు.