CM Jagan: స్వతహాగా ఏపీ సీఎం జగన్ మొండివాడు. ఆ మొండి తనమే ఆయనకు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆయనేమీ సుదీర్ఘకాలం రాజకీయం చేయలేదు. కీలక పదవులు చేపట్టలేదు. అయినా సరే సీఎం స్థాయికి వచ్చారంటే ఆయన మొండితనం,దూకుడు ప్రధాన కారణం. అయితే ఆ మొండితనం అన్నివేళలా పనిచేయదు. ఒక్కోసారి ప్రతికూలత కూడా చూపుతుంది. వచ్చే ఎన్నికల్లో అటువంటి ప్రతికూలత వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. అయితే దానిని సంక్షేమ పథకాల రూపంలో అధిగమిస్తానని జగన్ నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు ఎదురవుతున్న సవాళ్లను సైతం మొండితనంతో నిర్లక్ష్యం చేస్తున్నారు. దాని పర్యవసానాలు ఎన్నికల్లో ఉంటాయని హెచ్చరికలు వస్తున్నాయి.
ముందుగా జగన్ కు ఉద్యోగులు దూరమయ్యారు. ఉపాధ్యాయులు సైతం ఎదురు తిరిగారు. రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. అయినా సరే ఆ రెండు వర్గాల విషయంలో జగన్ మొండితనమే చూపారు. క్షేత్రస్థాయిలో ప్రజలపై ప్రభావితం చేసే వర్గాలను చేజేతులా దూరం చేసుకున్నారు. వారి విషయంలో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. గత ఎన్నికల ముందు సిపిఎస్ రద్దు చేస్తానన్న హామీ, ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం నింపుతానని చేసిన ప్రకటనను మరిచిపోయారు. అధికారంలోకి వచ్చాక వారికి అందుతున్న రాయితీలను నిలిపివేశారు. వేతన బకాయిలు చెల్లించడం లేదు. సహజంగానే వారు వ్యతిరేక వర్గీయులుగా మారిపోయారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా వ్యవహరిస్తున్నారు. అయినా అదే మొండితనంతో జగన్ ముందుకు సాగుతున్నారు.
అంగన్వాడీలు సుమారు 42 రోజుల పాటు సమ్మె కొనసాగించారు. వారిపై చివరకు ఎస్మా ప్రయోగానికి సైతం జగన్ వెనుకడుగు వేయలేదు. రూపాయి వేతనం పెంచకుండానే వారి సమ్మెను విరమింపజేశారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తానన్న హెచ్చరికతో దారికి తెచ్చుకున్నారు. వాస్తవానికి అంగన్వాడి ఉద్యోగులు పేద వర్గాలతో సంబంధాలు కలిగి ఉంటారు. అయినా సరే జగన్ వెనక్కి తగ్గలేదు. అదే మొండితనంతో అంగన్వాడీల సమ్మెకు చెక్ చెప్పారు. 104, 108 ఉద్యోగులకు సైతం అదే తరహా బెదిరింపులకు దిగారు. మీరు కానీ సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తానని.. అవసరమైతే ఆర్టీసీ డ్రైవర్లకు పెట్టి మరి నడిపిస్తానని హెచ్చరికలు పంపారు. దీంతో వారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
అయితే జగన్ మొండితనం తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ వైసీపీ వర్గాలు మాత్రం తిప్పి కొడుతున్నాయి. గత ప్రభుత్వాల కంటే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మెరుగైన పరిస్థితులు కల్పించామని.. సంక్షేమ పథకాలతో లేనిపోని ప్రచారాలన్నీ కొట్టుకుపోతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడే ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వ బాధిత వర్గాలుగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. జగన్ మొండితనానికి విరుగుడు చర్యలు ప్రారంభించారు. మరి అందులో జగన్ సక్సెస్ అవుతారా? లేకుంటే బాధిత వర్గాలు అనుకున్నది సాధిస్తారా? అన్నది చూడాలి.