Pawan Kalyan
Pawan Kalyan: ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం పై పడింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటమే అందుకు కారణం. అక్కడ పవన్ కు ఫేవర్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పవన్ ఓటమి సానుభూతి తెచ్చిపెట్టింది. పైగా అక్కడ మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి. పవన్ గెలుపునకు శ్రమిస్తున్నాయి. దీంతో వైసిపి ఆత్మ రక్షణలో పడింది. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఆ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేపట్టిన జగన్ సైతం పవన్ పై వ్యక్తిగత విమర్శల కంటే.. స్థానిక అంశాలను ప్రస్తావించి ప్రజా మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేయడం విశేషం.
గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్.. రెండు చోట్ల ఓడిపోయారు. అందుకే ఈసారి ఆయనపై సానుభూతి స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ ను గెలిపించేందుకు జనసైనికులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చిన జనసేన నేతలు సైతం పిఠాపురం లో జల్లెడ పడుతున్నారు. పవన్ గెలుపు కోసం ప్రజలను అభ్యర్థిస్తున్నారు. అటు బుల్లితెర నటులు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటువంటి తరుణంలో అక్కడ జనసేన గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. పవన్ కళ్యాణ్ కు భారీ మెజారిటీ తప్పదని విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇవే వైసీపీలో కలవరపాటుకు కారణం అవుతున్నాయి.
వైసీపీ అభ్యర్థి వంగా గీతకు మంచి పేరు ఉంది. ఆమె ప్రచారానికి సైతం ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. మరోవైపు ముద్రగడ పద్మనాభం రూపంలో అదనపు బలం తోడైంది. అయితే పవన్ కళ్యాణ్ పై ఉన్న సానుభూతితో ఈ అంశాలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఈ తరుణంలోనే జగన్ ఈ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేపట్టారు. కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారీగా జన సమీకరణ చేశాయి. కానీ జగన్ వ్యూహం మార్చారు. పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ తగ్గించారు. కేవలం లోకల్ అస్త్రాన్ని బయటకు తీశారు. పవన్ కళ్యాణ్ పై నాన్ లోకల్ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. వంగా గీత లోకల్ అని.. ప్రజలు పిలిచిన వెంటనే పలుకుతారని.. కానీ పవన్ అలా కాదని గుర్తు చేశారు. ఆయనకు జ్వరం వచ్చినా హెలిక్యాప్టర్లో హైదరాబాద్ వెళ్ళిపోతారని హెచ్చరించారు. పిలిచిన వెంటనే పలికే వంగా గీతను ఎన్నుకుంటారా? హెలికాప్టర్లలో తిరిగే పవన్ ను గెలిపిస్తారా? ఆలోచించుకోవాలని జగన్ ప్రజలకు పిలుపునివ్వడం విశేషం. ప్రస్తుతం జగన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.