Preity Zinta: ఇవసలే సోషల్ మీడియా రోజులు.. చీమ చిటుక్కుమన్నా చాలు.. వెంటనే ప్రపంచానికి తెలిసిపోతుంది. దానికి రకరకాల భాష్యాలు, వక్రీకరణలు తోడవుతాయి. దీంతో అసలు విషయం కాస్త మరుగున పడి.. అనవసర విషయం వెలుగులోకి వస్తుంది. ఆ తర్వాత సంజాయిషి ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితిని బాలీవుడ్ వెటరన్ నటి ప్రీతి జింటా ఎదుర్కొంటోంది. ఇంతకీ ఈ అమ్మడు ఏం చేసిందంటే..
ఇటీవల ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ పదవి నుంచి రోహిత్ శర్మను పక్కనపెట్టింది. అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకుంది. ప్రస్తుతం ఆ జట్టులో రోహిత్ శర్మ ఒక ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడుతూ ముంబై జట్టుకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చే సీజన్లో అతడు ముంబై జట్టును వీడిపోతాడని, మెగా వేలంలో పాల్గొంటారని చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే గనుక జరిగితే రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు యాజమాన్యాలు పోటీలు పడుతుంటాయి. రోహిత్ మెగా వేలంలో గనుక ఉంటే ప్రీతిజింటా అతడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉందని వార్తలు వచ్చాయి. “రోహిత్ బలమైన ఆటగాడు. అతడు జట్టులో స్ఫూర్తిని నింపుతాడు. స్థిరత్వాన్ని కొనసాగిస్తాడు. ఆశావాహ దృక్పథంతో ఉంటాడు. అలాంటి ఆటగాడు మెగా వేలంలోకి వస్తే.. అతడిని కొనుగోలు చేసేందుకు ఎంత దాకయినా వెళ్తామని” ప్రీతి జింటా వ్యాఖ్యలు చేసినట్టు కథనాలు ప్రచురితమయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి కూడా.
దీంతో ఈ విషయం ప్రీతి జింటా చెవికి చేరింది. ఫలితంగా ఆమె స్పందించక తప్పలేదు. “ఆ వార్తలు మొత్తం పూర్తి నిరాధారం. రోహిత్ ను నేను చాలా గౌరవిస్తాను. అతని ఆటకు నేను వీరాభిమాని. కానీ, నేను అతనితో ఆ పని చేయలేదు. కనీసం చర్చలు కూడా జరపలేదు. ఏ ముఖాముఖిలోనూ ఆ విధంగా ప్రకటన చేయలేదు. మా జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ అంటే కూడా నాకు చాలా గౌరవం. నా వివరణ లేకుండా అలాంటి సమాచారం ఎలా సేకరిస్తున్నారు? అసలు సోషల్ మీడియాలో ఎలా స్ప్రెడ్ చేయగలుగుతున్నారు? ఫేక్ సమాచారం స్ప్రెడ్ చేయడం మానేయండంటూ” ప్రీతి జింటా ట్విట్టర్ ఎక్స్ లో రాసుకొచ్చింది.