Amravati capital : అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ శంకుస్థాపనకు సమయం ఆసన్నం అయ్యింది. మే రెండున ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 5 లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది. ఉన్న నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనుండడంతో ప్రత్యేక ఆహ్వాన పత్రికలు రూపొందించారు. చూడ చక్కని డిజైన్లతో రూపొందించిన ఈ ఆహ్వాన పత్రికలను అతిధులకు ప్రత్యేకంగా పంపుతున్నారు. ఏపీ జిఏడి అధికారులు అమరావతి ఆహ్వాన పత్రిక పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆహ్వాన పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
* వైసిపి హయాంలో నిర్వీర్యం..
ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) హయాంలో అమరావతి రాజధాని పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కళ సంతరించుకుంది. గత పదేళ్లుగా రాజధానులేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీ దశ, దిశ మారుతుందనే దానికి సంకేతంగా ఈ ఆహ్వాన పత్రికను డిజైన్ చేయడం విశేషం. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లతో పాటు రాజధాని అమరావతి స్తూపం, అమరావతి నగర ఊహ చిత్రంతో ఆహ్వాన పత్రికను తయారు చేశారు. రాజధాని రైతులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఈ ఆహ్వాన పత్రికలను పంపుతున్నారు.
* ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఆరోజు ప్రధాని పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అమరావతి రాజధాని లో దాదాపు లక్ష కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి సమయం దగ్గర పడుతుండడంతో శరవేగంగా ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ జారీ అయింది. మే 2న తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రధాని మోదీ బయలుదేరనున్నారు. 2:50 గంటలకు విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో అమరావతి చేరుకుంటారు ప్రధాని. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తం గంట 15 నిమిషాల పాటు అమరావతి లోనే ఉంటారు ప్రధాని మోదీ.
* అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న చంద్రబాబు..
అమరావతి రాజధాని నిర్మాణానికి 2017లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. అందుకే గత అనుభవాల దృష్ట్యా ఏపీ సీఎం చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయన అడుగులు వేస్తుండడం.. అందుకు తగ్గట్టుగానే ప్రధాని మోదీ సహకారం అందిస్తుండడంతో అమరావతి.. త్వరితగతిన సాకారం అయ్యే అవకాశం కనిపిస్తోంది.