Amma Odi : ఏపీలో అమ్మఒడి బటన్ నొక్కి నాలుగు రోజులు గడుస్తోంది. కానీ ఇంతవరకూ తల్లుల ఖాతాలో నగదు జమకాలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే సాంకేతిక సమస్యలు అని.. బ్యాంకులకు సెలువులని పొంతన లేని సమాధానాలు వస్తున్నాయి. దీంతో తల్లులు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. నగదు పడలేదని తెలిసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. జూన్ 28న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో సీఎం జగన్ బటన్ నొక్కి అమ్మఒడి నగదు జమను ప్రారంభించారు. కానీ నాలుగు రోజులు గడుస్తున్నా సొమ్ము మాత్రం తల్లుల ఖాతాల్లోకి చేరలేదు. దీనికి ఈకేవైసీ కారణంగా చూపుతున్నారు. గత నెల 27వ తేదీలోగా ఈకేవైసీపీ చేసిన వారికి జూలై తొలివారంలో.. 28 తరువాత చేసిన వారికి జూలై రెండో వారంలో నగదు జమ అవుతుందని చెబుతున్నారు. కానీ అసలు కారణాన్ని మాత్రం దాచేస్తున్నారు.
బ్యాంకింగ్ ఆన్ లైన్ వ్యవస్థ మరింత సులభతరం అయ్యింది. నిమిషాల వ్యవధిలో వేల అకౌంట్లలోకి నగదును జమ చేయవచ్చు. ఇటువంటి చెల్లింపులన్నీ ఆర్బీఐ ఈకుబేర్ ప్లాట్ ఫామ్ తో జరుగుతాయి. ఒక్క బిల్లుతో గరిష్ఠంగా 50 వేల మంది ఖాతాల్లో నగదు జమ చేయవచ్చు. ఈ బిల్లులు అప్ లోడ్ చేసిన అరగంటలోనే నగదు చేరుతుంది. ఇటువంటి చెల్లింపులకు బ్యాంకుల సెలవుతో పని ఉండదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కుంటిసాకులు చెబుతోంది. జిల్లాలకు ఒక కారణం చెబుతూ వస్తోంది. ఆల్పాబీటకల్ ఆర్డర్ లో నగదు జమ అవుతుందని ఒక దగ్గర, బక్రీదు సెలవు అని మరోక దగ్గర.. ఇలా పొంతన లేని సమాధానాలు వస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,300 కోట్లు జమచేయాలి. కానీ ఇప్పటివరకూ రూ.2 వేల కోట్లు మాత్రమే జమ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఖజానాలో నగదు లేకపోవడమే జాప్యానికి అసలు కారణం. ఇప్పటివరకూ ఉన్న రూ.2 వేల కోట్లు జమచేశారు. ఇంకా రూ.4,300 కోట్లు జమ చేయాలంటే అప్పు తప్పనిసరి. కానీ జూలై 3 తరువాత అప్పు పుట్టే అవకాశముంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా జూలై రెండో వారం వరకూ అమ్మఒడి నగదు జమ అవుతుందని అనధికార ప్రకటనలు చేసింది. అటువంటప్పుడు ముందుగా ఎందుకు బటన్ నొక్కారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అటు సీఎం బటన్ నొక్కిన పార్వతీపురం మన్యం జిల్లా లబ్ధిదారులకు సైతం నగదు జమ కాలేదు. అక్కడ 80 శాతం మందికి ఇంకా జమకానట్టు తెలుస్తోంది. దీంతో ఆశగా ఎదురుచూడడం లబ్ధిదారుల వంతైంది.