Ambati Rambabu Sattenapalli Clash: మాజీమంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu) తీరులో మార్పు రావడం లేదు. మొన్నటికి మొన్న గుంటూరులో హల్ చల్ చేసిన ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సైతం అదే మాదిరిగా వ్యవహరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు పరిమిత సంఖ్యలోనే వెళ్లాలని సూచించారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించాయి. సత్తెనపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. మరోవైపు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన ప్రతాపం చూపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వాహనాలను అనుమతించాలని పోలీసులతో తగాదాకు దిగారు. అయితే అనుమతి లేదని పోలీసులు చెప్పగా.. ఎట్టి పరిస్థితుల్లో వెళ్లి తీరుతాము అంటూ అంబటి రాంబాబు ముందుకు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన బారీకేడ్లను తొలగించి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు నిలువరించారు.
Also Read: Police Action on Ambati Rambabu : అంబటికి పోలీసుల షాక్ ట్రీట్మెంట్!
కొద్ది రోజుల కిందట సిఐ తో వాగ్వాదం
కొద్ది రోజుల కిందట గుంటూరు( Guntur) కలెక్టరేట్కు నిరసనగా వెళ్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. జూన్ 4 న వెన్నుపోటు దినం పేరిట భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ర్యాలీగా వెళుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో కూడా అంబటి రాంబాబు పోలీసులపై నోరు పారేసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఓ సీఐ నుంచి షాకింగ్ పరిణామం ఎదురైంది. పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు ఎలా పోనివ్వరో చూస్తానని అన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీకి అనుమతించేది లేదని సీఐ తేల్చి చెప్పారు. సహనం కోల్పోయిన అంబటి రాంబాబు ఏం చేస్తావు అంటూ అభ్యంతరకరంగా మాట్లాడడంతో.. మర్యాదగా మాట్లాడండి, నోరు అదుపులో పెట్టుకోండి అని సిఐ బదులిచ్చారు. దీంతో అంబటి రాంబాబు పళ్ళు కొరుకుతూ నాలుక మడత పెట్టి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పళ్ళు కొడుకుతున్నారేంటి.. మీ బెదిరింపులకు భయపడే వారు ఎవ్వరు ఇక్కడ లేరని సిఐ స్పష్టం చేశారు. అటు తర్వాత అంబటి రాంబాబు పై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అయినా సరే అంబటి రాంబాబు తీరులో మార్పు రాలేదు. తాజాగా ఇప్పుడు పోలీస్ బారీకేడ్లను తోసుకుంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు.
దమ్ముంటే ఆపండి.. పోలీసులపై అంబటి రాంబాబు విశ్వరూపం
ఇలా తెగింపు ఉండాలి..@AmbatiRambabu Mass pic.twitter.com/cr59Tl81Fc
— Palnadu Ycp❤️ (@Naniyadav_YSJ) June 18, 2025
నియోజకవర్గ ఇన్చార్జ్ కోసం..
అయితే అంబటి రాంబాబు సత్తెనపల్లిలో( sattenapalle ) సత్తా చాటేందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2019 నుంచి 2024 మధ్య సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు ఉండేవారు. అయితే రహదారులపై డ్యాన్సులు వేయడం.. అవినీతి ఆరోపణలు రావడంతో సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఓడిపోయారు. అందుకే అక్కడ నుంచి అంబటి రాంబాబును తప్పించారు. అంబటి రాంబాబును గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించి.. సత్తెనపల్లి ఇన్చార్జి బాధ్యతలను వేరే నేతకు అప్పగించారు. అయితే ప్రత్యామ్నాయం లేకపోవడంతో అంబటి రాంబాబు సైతం సైలెంట్ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పని చేస్తూ వచ్చారు. అయితే ఎలాగైనా మళ్ళీ సత్తెనపల్లి ఇన్చార్జి పోస్టు రావాలని తాజాగా ఆయన దూకుడుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే అంబటి రాంబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆయనను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచి పార్టీ సేవల కోసం వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తన ప్రతాపం చూపాలన్న కోణంలోనే ఇటీవల ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.