Amaravati to Hyderabad : ఏపీ ( Andhra Pradesh) విషయంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతానికి భిన్నంగా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో పెండింగ్లో ఉన్న అంశాలకు పరిష్కార మార్గం చూపుతోంది. అందులో భాగంగా ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయాలకు రూపకల్పన జరుగుతోంది. తాజాగా ఏపీ రాజధాని అమరావతి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం తగ్గనుంది. దాదాపు నాలుగు గంటల వ్యవధిలోనే గమ్యానికి చేరుకునే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 11 సంవత్సరాలు అవుతోంది. గతంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా రకాల విభజన సమస్యలకు పరిష్కారం దొరకలేదు. వాటన్నింటికీ ఇప్పుడు మోక్షం కల్పిస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం.
Also Read : వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లకు నో సిగ్నల్.. ‘రాజు’ది గ్రేట్!
* అమలు కాని విభజన హామీలు..
రాష్ట్ర విభజన( state divide) సమయంలో చాలా రకాల అంశాలు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా రవాణాకు సంబంధించి ప్రాజెక్టులు మంజూరుకు నిర్ణయించారు. కానీ వాటి విషయంలో ఎటువంటి కదలిక లేకపోయింది. అయితే ఇప్పుడు అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కి పచ్చ జెండా ఊపింది కేంద్రం. ఈ మేరకు డిపిఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని హోం శాఖను ఆదేశించింది. అదేవిధంగా త్వరలో అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. మరోవైపు తెలంగాణలో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ మొదలైంది. బిపిఆర్ కార్యరూపం దాల్చితే.. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య ప్రయాణం కేవలం నాలుగు గంటలు మాత్రమే.
* అమరావతి విషయంలో ప్రాధాన్యం
అమరావతి రాజధాని( Amravati capital ) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పటికే బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. మరోవైపు రోడ్డు కం రైల్వే ప్రాజెక్టులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. ముఖ్యంగా రాజధానిని అనుసంధానం చేస్తూ రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. మరోవైపు ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటును పరిశీలించాలని పెట్రోలియం శాఖను కేంద్రం ఆదేశించింది. విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు క్యారిడార్ల ఏర్పాటును రైల్వే శాఖ పరిశీలించనుంది. పలు సమస్యల పరిష్కారానికి పలు శాఖలకు హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పెట్రోలియం రంగంలో అవకాశాలు వినియోగించుకోవడంలో ఏపీ ముందంజలో ఉందని కేంద్రం చెబుతోంది..
* గతానికి భిన్నంగా..
అయితే గతంలో రెండు సార్లు ఎన్డీఏ( National democratic Alliance ) అధికారంలోకి వచ్చింది. 2014లో తొలిసారిగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రాగా.. టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఏపీలో అధికారంలో ఉంది కూడా. అయితే రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్పట్లో కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. 2019లో మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చారు. అయితే అప్పట్లో జగన్ ఏపీలో అధికారంలోకి రాగలిగారు. అప్పుడు కూడా రాష్ట్రానికి కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు టిడిపి సహకారంతో మూడోసారి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ. ఏపీకి ఎనలేని ప్రాధాన్యం ఇస్తుండడం ఇప్పుడు విశేషం.
Also Read : అమరావతిలో ఏడాదిలో చంద్రబాబు కొత్త ఇల్లు.. భూమి పూజ.. నిర్మాణ బాధ్యత ఆ సంస్థదే!