Amaravati Re Launch: ఏదైనా ప్రజా ఉద్యమానికి చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడే అది సాకారం అవుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుందాం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆ ఉద్యమానికి ఊపిరి పోసింది కేసీఆర్. ఉద్యమ పార్టీని స్థాపించి.. తెలంగాణ జాతిని ఏకం చేసి స్వరాష్ట్రం పొందారు. అయితే విడిపోతే నష్టపోతామని భావించిన ఆంధ్రులు సమైక్యాంధ్ర పోరాటం చేశారు. కానీ దశాబ్దాలుగా తమ ఉనికి కోసం తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమమే గెలిచింది. ఇప్పుడు అదే కోణంలోకి వస్తుంది అమరావతి రాజధాని రైతుల ఉద్యమం( Amravati capital revolution ). సంకల్పం, నిజాయితీ ఉంటే.. తప్పకుండా పోరాటానికి గుర్తింపు లభిస్తుంది. అందుకు చక్కటి ఉదాహరణ అమరావతి రాజధాని ఉద్యమం. అమరావతి రైతులు పడిన కష్టాలు.. వారికి చరిత్రలో నిలిచిపోయే చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యులు అయ్యేలా చేశాయి.
Also Read: వరుసగా “ఆరు”.. మరే జట్టుకు సాధ్యం కాని రికార్డ్.. ముంబై ఘనత
* అందరి ఆమోదంతో..
2014లో తెలుగుదేశం( Telugu Desam Party) పార్టీ అధికారంలోకి వచ్చింది. 67 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడే రాష్ట్ర విభజన జరగడంతో రాష్ట్రానికి రాజధాని లేదు. అటువంటి సమయంలోనే రాజధాని ఎక్కడ పెడితే బాగుంటుంది.. అని అడిగితే సగటు ఏపీ పౌరుడు విజయవాడ వైపే చూపారు. ఉత్తరాంధ్ర ప్రజలు విజయవాడ అన్నారు. రాయలసీమ ప్రజలు విజయవాడకే జై కొట్టారు. ఎందుకంటే అది రాష్ట్రం మధ్యలో ఉంది. ఆపై కృష్ణా నది తీర ప్రాంతం. అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉండడంతో.. అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని విజయవాడకి ఎక్కువమంది జై కొట్టారు. అందుకే అప్పటి చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ, గుంటూరు ను కలుపుతూ అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాలని భావించింది. తద్వారా ఒక మహా నగరాన్ని సృష్టించవచ్చని అంచనా వేసింది.
* రైతుల త్యాగం
అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణానికి 33 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా అందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక సామాజిక సహకారం. ఆ భూమిలో ప్రభుత్వ కార్యాలయాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను నిర్మించాలని చంద్రబాబు సర్కార్ భావించింది. తద్వారా రిటర్న్ ఫ్లాట్ల రూపంలో తమకు, తమ భావితరాలకు మేలు జరుగుతుందని అమరావతి రైతులు ఆశించారు. స్వచ్ఛందంగా భూములు వదులుకున్నారు. అయితే చంద్రబాబు సర్కార్ చేసిన తప్పు ఒక్కటే. అనుకున్న స్థాయిలో వేగవంతంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించలేదు నాడు. పైగా అమరావతి మహా ఆశయం పెట్టుకుని.. అప్పటి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రావడం చంద్రబాబు చేసిన తప్పిదం. ఆ పరిణామమే అమరావతి పాలిట శాపంగా మారింది. ఏపీలో నెలకొన్న రాజకీయాలు సైతం అమరావతిని నిర్వీర్యం చేశాయి. తాము అధికారంలోకి వచ్చిన అమరావతి రాజధానిని కొనసాగిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానిని రాజధాని ప్రాంత ప్రజలు విశ్వసించారు. అందుకే తమ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసిన టిడిపిని సైతం తిరస్కరించారు. అమరావతి ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గంలో సాక్షాత్తు టిడిపి మంత్రి, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పోటీ చేసినా అక్కడి ప్రజలు ఆదరించలేదు.
* మూడు రాజధానులతో నిర్వీర్యం..
అయితే అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు సైతం టిడిపిని తిరస్కరించడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త కదలిక ప్రారంభమైంది. చంద్రబాబు రాజధానిని ఎంపిక చేయడం ఏంటి? ఆయన చరిత్రలో నిలిచిపోవడం ఏంటి? అన్న కోణంలో ఆలోచించి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది జగన్ సర్కార్. పాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును చేసి.. అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. నా మాటే శాసనం అంటూ.. అమరావతి అనేది ఓ 29 గ్రామాల సమస్యగా చూపించే ప్రయత్నం చేసింది. కానీ అదే అమరావతి రైతులు తమ భవిత కోసం చేసిన పోరాటం యావత్ ఏపీని కదిలించింది. అమరావతిని చిన్న సమస్యగా పరిగణించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. 2024 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమికి అమరావతి రాజధాని ఒకటి అని తేలిపోయింది.
* పార్లమెంట్లో చట్టం
అయితే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఏంటి అంటే.. ఇకనైనా అమరావతి రాజధాని అనేది శాశ్వతంగా అవుతుందా? లేదా? అన్నదే అనుమానం. అయితే గతం మాదిరిగా పరిస్థితి ఉండే అవకాశం లేదు. కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. గత రెండుసార్లు కు భిన్నంగా అమరావతి రాజధానికి కేంద్రం ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. బడ్జెట్లో( Central budget) సైతం నిధులు కేటాయించింది. అప్పుల రూపంలో సర్దుబాటు చేస్తోంది. దాదాపు అమరావతికి 40 వేల కోట్ల నిధుల సమీకరణ జరిగింది. అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రాజెక్టులు, ప్రైవేటు సంస్థలు అమరావతి రాజధాని లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడుతున్నాయి. ఇది చాలదన్నట్టు రాష్ట్ర శాసనసభలో అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రతిపాదిస్తూ ఆమోదం తీసుకొనున్నారు. వాటిని పార్లమెంటుకు నివేదించనున్నారు. పార్లమెంట్లో అమరావతి శాశ్వత రాజధాని అంటూ తీర్మానం చేయనున్నారు. గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అమరావతి రాజధాని శాశ్వతం అని.. దానిని కదిలించడం అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఆంధ్రుల కల.. అమరావతి పునః ప్రారంభం నేడే!