Amaravati Phase-2 Land Pooling: అమరావతిలో( Amravati capital ) మరో కీలక ఘట్టం ప్రారంభం అయ్యింది. రెండో విడత భూ సమీకరణ మొదలైంది. అయితే రెండో విడతపై రకరకాల చర్చ నడిచింది. మొదటి విడత మాదిరిగా రైతుల నుంచి ఆ స్థాయిలో ఆసక్తి లేకుండా పోయింది. దానికి కారణం అమరావతి రైతుల్లో ఒక రకమైన అనుమానం. అమరావతికి చట్టబద్ధత కల్పించకపోవడం.. అనుకున్న స్థాయిలో ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడం, రిటర్నబుల్ ఫ్లాట్స్ విషయంలో జాప్యం జరగడంతో ఆ ప్రభావం రెండో విడతపై పడింది. మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదు. ఇటువంటి సమయంలో రెండో విడత ఎలా ఇస్తామని చాలా గ్రామాల్లో రైతులు ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే ఇదే ఆదునుగా వ్యతిరేక ప్రచారాన్ని కూడా మొదలు పెట్టింది సోషల్ మీడియా. అందుకే భూ సమీకరణ అనగానే ఒక రకమైన అసంతృప్తి అమరావతి రైతుల నుంచి రావడం నిజమే. అయితే సందేహాల నివృత్తికి నేరుగా రంగంలోకి దిగింది ప్రభుత్వం. ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి డిప్యూటీ కలెక్టర్లు అందుబాటులో ఉంటున్నారు.
* రెండో విడతలో 20వేల ఎకరాలు..
తొలివిడతగా 35 వేల ఎకరాలకు పైగా భూ సమీకరణ చేశారు. ఇప్పుడు రెండో విడత మరో 20 వేల ఎకరాలు అదనంగా సమీకరించేందుకు నిర్ణయించారు. తొలి విడత రైతులకు ఏ ప్యాకేజీలు ప్రకటించారో.. అదే తరహాలో ఇప్పుడు కూడా అందించేందుకు నిర్ణయించారు. మంత్రి నారాయణ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆపై సి ఆర్ డి ఏ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ముందుకు వచ్చే రైతుల నుంచి భూములు సేకరిస్తున్నారు. ఇవ్వని వారికి అవగాహన కల్పిస్తున్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అందుకు అనుగుణంగా ఈ అదనపు భూ సమీకరణ చేస్తోంది.. నిన్ననే ప్రారంభమైన ఈ సమీకరణ అనేది వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తోంది ప్రభుత్వం.
* వైసిపి మాటలను పట్టించుకోని జనం..
అమరావతి రైతులకు అన్యాయం జరిగిందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే దానిని ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. ఐదేళ్లపాటు వైసీపీ నిర్లక్ష్యాన్ని వారు గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ బాధ్యతగా వ్యవహరించి ఉంటే తమకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని వారు ఆవేదనతో చెబుతున్నారు. ఆపై భూ సమీకరణతో పాటు అమరావతి రైతులకు అనుకున్న స్థాయిలో ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్న విమర్శ ఉంది. కానీ కూటమి వచ్చిన తర్వాత అమరావతి రైతులకు ఏటా కౌలు చెల్లింపులు చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో బకాయిలను సైతం చెల్లిస్తూ వస్తోంది. రిటర్నబుల్ ఫ్లాట్స్ విషయంలో కొన్ని రకాల అభ్యంతరాలు ఉన్నాయి. ఒకచోట చెప్పి మరోచోట ఇచ్చారని రైతులు అభిప్రాయపడుతున్నారు. దానిని వ్యతిరేకంగా చిత్రీకరిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొన్న ఆ మధ్యన అమరావతి రైతు ఒకరు గ్రామ సభలో గుండెపోటుతో చనిపోయారు. దానిని ప్రభుత్వ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మరోవైపు నిన్ననే ప్రారంభమైన భూ సమీకరణ సాఫీగా జరుగుతోంది. అనుకున్న గడువులోగా భూమిని సమీకరించాలని ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతోంది.