Amaravati Capital Construction: అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భవన నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయి. ఇంకోవైపు ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూముల్లో సైతం నిర్మాణాలు జోరందుకున్నాయి. అయితే మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా చాలా రకాల అడ్డంకులు ఉండేవి. ముఖ్యంగా అంతర్గత రహదారులు, ప్రధాన కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి పనులు పెండింగ్లో ఉండేవి. దానికి కారణం రైతులు భూములు ఇవ్వకపోవడమే. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు సహా 28 రాజధాని గ్రామాలకు చెందిన రైతులు భూములు ఇవ్వకపోవడంతో రోడ్డు కనెక్టివిటీ పనులు నిలిచిపోయాయి.
* జగన్మోహన్ రెడ్డిని కలిసిన రైతులు..
మొన్ననే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు పెనుమాక, ఉండవల్లి రైతులు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు తమ భూములు ఇవ్వాలని చెప్తున్నారని.. అక్కడ మార్కెట్ ధర ప్రకారం డబ్బులు చెల్లించడం లేదని వాపోయారు. అందుకే తాము భూములు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అయితే అలా చెప్పిన మరుసటి రోజు చాలామంది రైతులు తమ భూములు ఇచ్చేశారు. అయితే ఈ ప్రధాన కనెక్టివిటీ రోడ్ల నిర్మాణానికి 2766 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఒకవైపు రైతులు జగన్ మోహన్ రెడ్డిని కలిసే సరికి భూముల సేకరణ కష్టమని భావించారు. కానీ ఇప్పుడు ఆ భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. వారి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోంది. రాజధాని కోర్ ఏరియా పరిధిలో రోడ్ల నెట్వర్క్ పూర్తి కావాలంటే ఈ భూములు కీలకం కావడంతో… వీలైనంత త్వరగా భూములను సేకరించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ముమ్మర కసరత్తు ప్రారంభించారు.
* ఎట్టకేలకు భూములు అప్పగింత..
మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు సమాన ప్రాతిపదికన ప్రాధాన్యం కల్పిస్తున్నారు. కానీ పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు గ్రామాల రైతులు మాత్రం అదనంగా ఆశిస్తున్నారు. అయితే మిగతా అమరావతి రైతులకు భిన్నంగా వీరికి ప్రయోజనాలు కల్పిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని సి ఆర్ డి ఏ అధికారులు భావించారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో.. ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చే ప్రయోజనాలను, ప్లాట్ల కేటాయింపుల్లో ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను రైతులకు వివరిస్తున్నారు అధికారులు. దీనిపై రైతుల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది. ఉండవల్లితో పాటు పెనుమాక పరిధిలో రైతులు తాజాగా 30 ఎకరాల భూమిని అప్పగించారు. ఈ 30 ఎకరాల అప్పగింతతో సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు పలు ప్రధాన అంతర్గత లింకు రోడ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగినట్టే.
