Jagan on AP Capital: రాజకీయాలను రాజకీయంగానే చూడాలి. వ్యూహాలకు పెద్దపీట వేయాలి. ప్రతికూలత వస్తుందనుకుంటే దాని గురించి అస్సలు ప్రస్తావించకూడదు. దాటవేత ధోరణి అనేది ముఖ్యం. అయితే ఇప్పుడు ఆ పని చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన అమరావతికి అన్యాయం చేశారన్న విమర్శను ఎదుర్కొన్నారు. అది వాస్తవం కూడా. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఈ అంశంపైనే ఆయనను వ్యతిరేకిస్తూ తీర్పు చెప్పారు. అయితే ఇప్పుడు అమరావతి రైతులు ఆ విషయాన్ని పక్కన పెట్టారు. తెలుగుదేశం సర్కారు విషయంలో అసంతృప్తితో ఉన్నారు. మొదటి విడతలో భూములు తీసుకున్న రైతులకు సంబంధించిన చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు శ్రీకారం చుట్టడంపై అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. వాటిపై ఎలా ముందుకు వెళ్లాలో తెలియక సతమతం అవుతోంది చంద్రబాబు సర్కార్. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అమరావతి పై మాట్లాడిన జగన్ కూటమిని సేవ్ చేశారు. అమరావతి రైతుల నుంచి అసంతృప్తి, విమర్శలు రాకుండా చేశారు.
ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు
వారంలో నాలుగు రోజుల పాటు బెంగళూరులో ఉంటున్న జగన్.. మిగతా మూడు రోజులు మాత్రం తాడేపల్లి కి వస్తున్నారు. శాసనసభకు హాజరు కాకపోవడం వల్ల ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. సరిగ్గా అమరావతి రైతులు కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉండగా.. నదీ గర్భంలో రాజధాని ఉందని.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఉన్నచోట కాకుండా.. గుంటూరు- విజయవాడ మధ్య రాజధాని తక్కువ ఖర్చుతో నిర్మిస్తే సరిపోతుంది అని వ్యాఖ్యానించారు. దీంతో అమరావతి రైతులు పునరాలోచనలో పడ్డారు. మీరంతా చంద్రబాబు పక్షాన ఉండాలని.. టిడిపి కూటమి ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని ఆయన అమరావతి రైతులకు చెప్పినట్లు అయింది. అయితే సరిగ్గా ఎటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారు.
అనవసర జోక్యం..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిపై వేసిన వేషాలు రైతులకు తెలియంది కాదు. దానికి ఎన్నికల్లో మూల్యం కూడా చెల్లించుకుంది. ఇప్పటికీ కూడా అమరావతి రైతులు వైసీపీ పై కోపం తగ్గించుకోలేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు దాని నుంచి తెలివిగా తప్పుకోవాలి. అంతే తప్ప పదేపదే జోక్యం చేసుకుంటూనే ఉంటామంటే చేయగలిగింది ఏమీ లేదు కూడా. చేజేతులా వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం టిడిపి కూటమి ప్రభుత్వం అమరావతి పై ప్రాణం పెట్టి పనిచేస్తోంది. అటువంటి చోట చిన్నపాటి అసంతృప్తి వచ్చింది. మౌనంగా గమనించాల్సింది పోయి.. అసలు అమరావతి అనేది రాజధాని కాకుండా మరోచోటకు మార్చాలని జగన్ చెప్పడంతో సీన్ మారింది. ఇప్పుడు అమరావతి రైతులు జగన్ పై ఫోకస్ పెట్టారు. టిడిపి సర్కార్ పై అసంతృప్తిని తగ్గించుకున్నారు. చిరంజీవి నటించిన అందరివాడు చిత్రంలో సునీల్ చెప్పిన మాదిరిగా ఉంది. చివరిదాకా వచ్చి అవకాశాన్ని చెడగొట్టాడు అంటూ విలన్ ను తిడతాడు సునీల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఆ పార్టీ శ్రేణులు అదే కోపంతో ఉన్నారు.