Cheepurupalli YSRCP: ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో విజయనగరం జిల్లాది ప్రత్యేక స్థానం. ఉమ్మడి రాష్ట్రంలో అయినా.. నవ్యాంధ్రప్రదేశ్ లో అయినా రాజకీయంగా విజయనగరం జిల్లాకు ఎనలేని ప్రాధాన్యత దక్కుతోంది. దశాబ్దాలుగా ఈ జిల్లాలో పూసపాటి అశోక్ గజపతిరాజు, బొత్స సత్యనారాయణ రాజకీయాలు చేశారు. అశోక్ గజపతిరాజు ఎన్నో పదవులు అనుభవించి ఇప్పుడు గోవా గవర్నర్గా రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్లారు. బొత్స సత్యనారాయణ ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే అశోక్ గజపతిరాజు తన వారసురాలు అదితి గజపతిరాజును పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చి క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ సైతం అదే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వారసురాలిని రంగంలోకి దించాలని భావిస్తున్నారు.
శాసనమండలిలో వైసిపి పక్ష నాయకుడిగా..
ప్రస్తుతం విశాఖ( Visakhapatnam) జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు బొత్స. ఆయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ పార్లమెంటరీ స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల నాటికి ఆమె తిరిగి యాక్టివ్ అవుతారని కూడా ప్రచారం నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బొత్స తన కుమారుడు తో పాటు కుమార్తెను రాజకీయంగా రంగంలోకి దించాలని చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు చీపురుపల్లిలో అన్ని తానై వ్యవహరించారు బొత్స మేనల్లుడు చిన్న శ్రీను.. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటూ చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతలు చూసేవారు. అయితే ఆయనకు జగన్మోహన్ రెడ్డి భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో చీపురుపల్లి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోటు ఉంది.
వైద్య వృత్తిలో కొనసాగుతూ..
బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana) కుమార్తె అనూష వైద్య వృత్తిలో ఉన్నారు. విజయనగరంలో ప్రముఖ డాక్టర్ గా సేవలందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె తరచూ చీపురుపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తుండడం విశేషం. అక్కడ క్యాడర్ తో మమేకమై ఆమె పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో డాక్టర్ అనూష పోటీలో ఉంటారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి కోటి సంతకాల సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. చీపురుపల్లిలో అనూష ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
జగన్ గ్రీన్ సిగ్నల్..
జగన్మోహన్ రెడ్డి సైతం డాక్టర్ అనూష అయితే చీపురుపల్లిలో సునాయాసంగా గెలుస్తారని భావిస్తున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు చీపురుపల్లి నియోజకవర్గంలో అనూష పరిస్థితిని నివేదికల రూపంలో హైకమాండ్కు అందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డాక్టర్ అనూష పేరు చీపురుపల్లి తో పాటు జిల్లాలో వినిపిస్తోంది. ఆమె అయితే బలమైన అభ్యర్థి అవుతారని కూడా భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బొత్స కుటుంబంలో మరో తరం రంగంలోకి దిగితే గాని చరిష్మ రాదు అని భావిస్తున్నారు. అందుకే ఈ యువ డాక్టర్ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.