Amaravati Drone Summit 2024: డ్రోన్సే మన బలం.. AI అంత potential ఉన్న రంగం ఇది. ఇది ఒక గేమ్ ఛేంజర్ అవుతుందా?

ఒకప్పుడు కంప్యూటర్ పుట్టుక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అన్ని రంగాలకు విస్తరించింది. ఇప్పుడు కంప్యూటర్ లేని వ్యవస్థ లేదు. కంప్యూటర్ లేకుండా వ్యవస్థ ముందుకు సాగే అవకాశం లేదు. అయితే మన సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ తోనే ఆగిపోలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 23, 2024 9:44 am

Amaravati Drone Summit(2)

Follow us on

Amaravati Drone Summit 2024: కంప్యూటర్, సెల్ ఫోన్, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్.. అనేక రకాలుగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పరిశోధకులు ఆవిష్కరించిన మరో అద్భుతం డ్రోన్.

డ్రోన్ అంటే ఒక నిర్ణీత ఎత్తులో ఎగురుతుంది. కావలసిన పనులు చేసి పెడుతుంది. విమానం ద్వారా చేయలేనివి.. హెలికాప్టర్ ద్వారా సాధ్యం కానివి డ్రోన్ వల్ల అవుతాయి. అయితే ఈ డ్రోన్ కూడా రకరకాల మార్పులకు గురవుతూ ఏకంగా యుద్ధాలు చేసే స్థాయికి ఎదిగింది. పెళ్లిళ్ల ఫోటోలు, వీడియోలు, ఏవైనా భారీ దృశ్యాలను తీయడానికి మాత్రమే కాదు, అనేక రకాలైన సాంకేతిక ప్రక్రియల్లో డ్రోన్లను ఉపయోగిస్తారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో వరదలు సంభవించినప్పుడు.. బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డ్రోన్లను ఉపయోగించారు. పారిశుద్ధ్య పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించారు. అపార్ట్మెంట్లలో చిక్కుకుపోయిన వరద బాధితులకు ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి డ్రోన్లను వాడుకున్నారు. గుంటూరు జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేసి ఏపీ అధికారులు సరికొత్త చరిత్ర సృష్టించారు. అయితే అది జస్ట్ శాంపిల్ మాత్రమేనని.. భవిష్యత్తు మొత్తం డ్రోన్ల ద్వారానే సాగుతుందని నిన్నటి అమరావతి డ్రోన్ షో ద్వారా ఏపీ ప్రభుత్వం నిరూపించింది.

భవిష్యత్తు డ్రోన్లదే

ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సంచలనం. దీని ద్వారా ఎన్నో అద్భుతాలను పరిశోధకులు ఆవిష్కరిస్తున్నారు. మూగవారు మాట్లాడే అవకాశం.. చనిపోయిన వారితోనూ సంభాషించే సౌలభ్యం వంటివి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా కల్పిస్తున్న తాజా సంచలనాలు. మున్ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో తెలియదు కానీ ఇప్పటికైతే రోజుకో తీరుగా సంచలనాన్ని సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఎన్ని లాభాలు అయితే సమకూరుతున్నాయో.. ప్రస్తుత కాలంలోనూ, భవిష్యత్తులోనూ డ్రోన్ల ద్వారా అన్ని ఉపయోగాలు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ఇటీవల హమాస్ , హెజ్ బొల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ డ్రోన్ల ద్వారానే దాడులు చేసింది. ఇరాన్ పై డ్రోన్ల ద్వారానే బాంబుల వర్షం కురిపిస్తోంది.. ఇరాన్ అంతటి క్షిపణుల వర్షం కురిపించినప్పటికీ.. డ్రోన్ల ద్వారానే ఇజ్రాయిల్ అడ్డుకున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు.. మరెన్నో సంచలనాలు..

పసిగట్టింది

డ్రోన్ల ద్వారా భవిష్యత్తులో కలిగే ఉపయోగాలను.. లాభాలను ఉద్దేశించి ఏపీలోని కూటమి ప్రభుత్వం ఏకంగా అమరావతి డ్రోన్ షో నిర్వహించింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమం నభూతో న భవిష్యత్తు అన్నట్టుగా సాగింది. కృష్ణానది తీరంలో డ్రోన్ల ద్వారా రూపొందించిన షో వీక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాత్రి ఎన్ని గంటల 30 నిమిషాలకు మొదలైన ఈ షో.. చాలాసేపటి వరకు సాగింది.. ఒకేసారి 5,500 డ్రోన్లు పైకి లేవడంతో ఆకాశంలో నక్షత్ర భ్రాంతి కలిగింది. పండగకు ముందే ఆకాశంలో దీపావళి కాంతులను విరజిమ్మింది. అయితే ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, కేంద్ర పౌర విమానయాన సహాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హాజరయ్యారు.. షో అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. డ్రోన్లకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఏపీలో 300 ఎకరాలలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ” ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరికొత్త సాంకేతిక అస్త్రంగా ఇప్పుడు ఉంది. డ్రోన్ తయారీ పరిశ్రమ కూడా అదే స్థాయిలో ఎదుగుతుంది. భవిష్యత్తు కాలం మొత్తం డ్రోన్ ఆధారంగానే సాగుతుంది. ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని” రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.