Amaravati Drone Summit 2024: ఏఐ, డ్రోన్స్.. మాస్టర్ మైండ్ ‘బాబు’.. పక్కరాష్ట్రాలను మించి ఏపీ ఎదిగిలే అద్భుత ప్లాన్లు

నార్మేనియా - అజర్ బైజాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భం అది. నార్మేనియా క్షిపణులు, పే లోడ్ లతో దాడులు చేస్తోంది. దీనికి ప్రతిగా అజర్ బైజాన్ డ్రోన్ లతో ప్రతి దాడులు మొదలుపెట్టింది. ఫలితంగా నార్మేనియా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వాస్తవానికి శత్రువినాశనమే లక్ష్యంగా నార్మేనియా భారీగా ఖర్చు పెడితే.. అజర్ బైజాన్ అదును చూసి డ్రోన్లతో దెబ్బ కొట్టింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 23, 2024 12:26 pm

Amaravati Drone Summit 2024(2)

Follow us on

Amaravati Drone Summit 2024: ఇక ఇటీవల రష్యా విరుచుకుపడినప్పుడు ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించింది. అత్యంత శక్తివంతమైన రష్యాను నిలువరించింది. ఇరాన్, హమాస్, హెజ్ బొల్లా పై ఇజ్రాయిల్ డ్రోన్ల తోనే దాడులు చేసింది. హమాస్, హెజ్ బొల్లా చీఫ్ లకు మరణ శాసనం రాసింది. ఇలా చెప్పుకుంటూ పోతే డ్రోన్ లు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. డ్రోన్ ల వినియోగం భారీగా పెరుగుతున్నప్పటికీ.. వాటి తయారీకి సంబంధించి మన దేశంలో పరిశ్రమలు ఆశించినంత స్థాయిలో లేవు. పైగా డ్రోన్ల తయారీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించిన దాఖలాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కాలాన్ని ముందే గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రోన్ ల తయారీ కేంద్రంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి డ్రోన్ షో నిర్వహించారు. ఏకంగా ఐదు గిన్నిస్ రికార్డులను సాధించారు. దీనికంటే ముందు అంటే రెండు నెలల క్రితం నుంచి డ్రోన్ తయారీ పరిశ్రమకు, ఏపీని డ్రోన్ రాజధాని చేసేందుకు ఆయన సంకల్పించారు. డ్రోన్ తయారీకి ఎలాంటి వనరులు కావాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దానికి అనుకూలంగా ఉంటుందా? ఎలాంటి కంపెనీలను ఆహ్వానించాలి? వాటికి ఏ విధమైన అనుకూల పరిస్థితులను కల్పించాలి? అనే విషయాలపై తీవ్రంగా మదనం జరిపారు. కేంద్రం ప్రోత్సాహం కూడా లభించడంతో ముందడుగు వేశారు. మంగళవారం నిర్వహించిన డ్రోన్ షో ద్వారా ఏపీ ఇక పై డ్రోన్ ల తయారీ రాజధానిగా చంద్రబాబు ప్రకటించారు. డ్రోన్ షో ముగిసిన తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

వాటిని కాదని..

వాస్తవానికి ఏ రాష్ట్రమైనా సరే భారీగా పెట్టుబడులు పెట్టి.. భారీగా పన్నులు వచ్చే రంగాలను ఎంచుకుంటుంది. దీనివల్ల యువతకు ఉద్యోగాలతో పాటు.. అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని నమ్ముతుంది. ఏపీలో విస్తారంగా భూములు ఉన్నాయి. విశేషంగా వనరులు ఉన్నాయి. అచంచలమైన సముద్రతీర ప్రాంతం ఉంది. ఓడ రేవులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఫార్మా, ఐటీ రంగాలను అభివృద్ధి చెందించేందుకు అవకాశం ఉంది. కానీ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ లో ఐటి, ఫార్మా విశేషమైన అభివృద్ధి చెందింది. ఈ రాష్ట్రాలు దేశానికే ఐటీ, ఫార్మా రాజధానులుగా కొనసాగుతున్నాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఏపీని ఐటి పరంగా, ఫార్మా పరంగా అభివృద్ధి చేయవచ్చు. కాకపోతే దేనికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితుల్లో ఇలా చేయడం సాధ్యం కాదు. ఓవైపు రాజధాని నిర్మాణం.. మరోవైపు ఐటీ, ఫార్మా అభివృద్ధి చేయడం అంత సులువైన విషయం కాదు. అందుకే చంద్రబాబు టెక్నాలజీని నమ్ముకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలను నిర్మించిన ఆయన.. ఇప్పుడు ఏపీని డ్రోన్ సిటిగా మార్చడానికి కంకణం కట్టుకున్నారు.

ఏపీకి విస్తారమైన ఓడరేవులు ఉన్నాయి. రోడ్డు మార్గాలు కూడా ఉన్నాయి. విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం లాంటి విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో రూపు దిద్దుకునే డ్రోన్లను ఇతర దేశాలకు ఈ విమానాశ్రయాల మీదుగా రవాణా చేయడానికి అవకాశం ఉంది. మరోవైపు విజయవాడ విమానాశ్రయాన్ని విస్తరించడానికి కేంద్రం కూడా సిద్ధంగా ఉంది. భోగాపురం విమానాశ్రయం కూడా నిర్మాణంలో ఉంది. ఇక కాకినాడ, కృష్ణపట్నం వంటి పోర్ట్ లు కూడా అనువుగా ఉన్నాయి. వీటి ద్వారా కూడా ఇతర ప్రాంతాలకు డ్రోన్ లను రవాణా చేయవచ్చు. పైగా డ్రోన్ రంగంలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. అవసరాల దృష్ట్యా భవిష్యత్తు కాలంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. పైగా డ్రోన్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అంతంధానించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. అందువల్లే ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. అమెజాన్, టెస్లా, ఫెడ్ ఎక్స్, వాల్ మార్ట్ వంటి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దేశీయంగా కూడా మహేంద్ర ఏరోస్పేస్ డ్రోన్ల తయారీ వైపు ఆసక్తి చూపిస్తోంది. పైగా డ్రోన్ ల తయారీ పూర్తిగా సాంకేతికత మీద ఆధారపడి ఉంది. అందువల్లే డ్రోన్ ల తయారీని ప్రోత్సహించడం వల్ల సాంకేతిక నిపుణులకు ఉపాధి లభిస్తుంది. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడులో వంటి రాష్ట్రాలు మ్యానుఫ్యాక్చర్ విభాగంలో నెంబర్ వన్ గా ఉన్నాయి. ఐటీలో హైదరాబాద్ కర్ణాటక, ఫార్మా లోనూ హైదరాబాద్, కర్ణాటక టాప్ స్థానాలలో కొనసాగుతున్నాయి. వాటిని భర్తీ చేయడం లేదా వాటికి సరి సమానంగా రావడం ఏపీ రాష్ట్రానికి అంత సులువు కాదు. అందువల్లే చంద్రబాబు టెక్నాలజీని నమ్ముకున్నారు. టెక్నాలజీ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ సామర్థ్యాన్ని సాధించవచ్చు. ఫలితంగా ఉపాధితో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది. పర్యావరణ విధ్వంసం ఉండదు. పైగా అంతర్జాతీయ స్థాయిలో అమరావతి పేరు మార్మోగిపోతుంది. ఒకప్పుడు గుట్టలు, రాళ్లు రప్పలతో నిండి ఉన్న మాదాపూర్ లాంటి ప్రాంతం నేడు వేలకోట్ల ఐటీ వ్యవస్థ లాగా రూపాంతరం చెందింది. సైబర్ టవర్స్ నిర్మాణం వల్ల సైబరాబాద్ అనే ప్రాంతం పుట్టింది. హైటెక్ సిటీ అనేది పురుడు పోసుకుంది. ఈ ప్రాంతాలలో దేశ విదేశాల నుంచి కంపెనీలు వచ్చి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. బ్యాకప్ సెంటర్లను పెట్టుకున్నాయి. వేలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి విశేషమైన ఆదాయాన్ని ఇస్తున్నాయి.. అంటే టెక్నాలజీ వల్ల ఇన్ని అద్భుతాలు సాధ్యమయ్యాయి. భవిష్యత్తు కాలంలో అమరావతి కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందువల్లే డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు రాజధానిగా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు..