Amaravati 2025 development updates: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత నెలలో ప్రధాని మోదీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ పరంగా నిర్మాణాలతో పాటు ప్రైవేటు సంస్థల నిర్మాణాలు సైతం ప్రారంభమయ్యాయి. దీంతో అమరావతి రాజధానికి కొత్త కళ వచ్చింది. వేలాదిమంది కార్మికులతో.. వందలాది యంత్రాలతో పనులు ఉత్సాహ భరిత వాతావరణంలో సాగుతున్నాయి. వేలాదిమంది కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇప్పటికే టెండర్లు పూర్తయిన వాటికి పనులు ప్రారంభించారు. మిగతా వాటికి టెండర్లు పూర్తిచేసే పనిలో ఉంది సిఆర్డిఏ. ఇదే ఊపుతో పనులు జరిగితే మాత్రం 2028 నాటికి అమరావతికి ఒక రూపు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర రైల్వే, రోడ్డు ప్రాజెక్టులు సైతం పట్టాలెక్కుతున్నాయి. ఏకకాలంలో మాత్రం పనులు జరిపితే వేలాదిమంది కార్మికులకు ఉపాధితో పాటు పరోక్షంగా లక్షల కుటుంబాలకు చేతినిండా పని దొరికే అవకాశం ఉంది.
కూటమి వచ్చిన తర్వాత కొత్త కళ..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి కదలిక వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లపాటు అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. దాదాపు 50 వేల ఎకరాలు లో నిర్మాణాలు నిలిచిపోయాయి. కనీస నిర్వహణ లేక అడవిని తలపించింది అమరావతి. పిచ్చి మొక్కలు, భారీగా పెరిగిన చెట్లు, ఆపై నీరు చేరడంతో.. ఆ ప్రాంతమంతా నిషేధిత ఏరియా గా మారిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 35 కోట్ల రూపాయలతో జంగిల్ క్లియరెన్స్ చేసింది. అమరావతిని యధా స్థానానికి తీసుకొచ్చింది. గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీని పిలిచి అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది కూటమి ప్రభుత్వం.
నిధుల సమీకరణ తర్వాత..
కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత మాత్రమే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాదిలో అవసరమైన నిధులను సమీకరించుకోగలిగింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే దాదాపుగా 60 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. పనులు కూడా అప్పగించారు. కాంట్రాక్టు సంస్థలు రంగంలోకి దిగాయి. ఐకానిక్ భవనాల( iconic buildings ) నిర్మాణ పనుల ప్రారంభానికి భారీగా యంత్రాలను తెస్తున్నారు. మెటీరియల్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇతర భవనాల పనులు 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో కొనసాగుతున్నాయి. అయితే ఒక వైపు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యం.. కార్మికుల చేతినిండా పని దొరుకుతుంది. ఉపాధి కేంద్రంగా అమరావతి రాజధాని మారింది.
Also Read: Amaravati: అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. సింగపూర్ సడన్ ఎంట్రీ!
ఎటు చూసినా జనమే..
భారీ యంత్రాలు, వాహనాలు అమరావతికి చేరుకున్నాయి. ఇక వేలాది మంది కార్మికులతో అమరావతి రద్దీగా కనిపిస్తోంది. మిగతా టెండర్లు సైతం పూర్తి అయితే ఏకకాలంలో అన్ని రకాల నిర్మాణ పనులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐకానిక్ భవనాల నిర్మాణ పనులకు భారీ వాహనాలు సిద్ధమయ్యాయి. కాంట్రాక్టు సంస్థలు అన్ని బడా కంపెనీలు కావడంతో అత్యాధునిక టెక్నాలజీతో శరవేగంగా పనులు చేయిస్తున్నారు. వచ్చే రెండేళ్ల కాలంలో ప్రభుత్వ నిర్మాణాలన్నీ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 2028 ద్వితీయార్థం నాటికి పనులు పూర్తిచేసి.. 2029 ఎన్నికల నాటికి అమరావతిని ప్రచారాస్త్రంగా మార్చుకోవాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. మరి వారి ప్రయత్నాలు ఫలిస్తాయో? లేదో? చూడాలి.