https://oktelugu.com/

Amaravati: అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. సింగపూర్ సడన్ ఎంట్రీ!

Amaravati మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్( Singapore) భాగస్వామ్యం కానుంది. ఈరోజు సింగపూర్ కు చెందిన ప్రతినిధుల బృందం అమరావతి రాజధాని లో పర్యటించింది.

Written By: , Updated On : April 3, 2025 / 02:12 PM IST
Amaravati

Amaravati

Follow us on

Amaravati: అమరావతి రాజధాని( Amravati capital ) పున ప్రారంభానికి అడుగులు శరవేగంగా పడుతున్నాయి. ఈ నెలలోనే అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా శ్రీకారం చుట్ట నున్నారు. ఈరోజు మంత్రివర్గ భేటీలో ఇందుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం కూడా సహాయపడుతోంది. 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని బడ్జెట్లో ప్రకటించింది. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఈ నిధులు సర్దుబాటు చేయనుంది. అందులో మొదటి విడత సాయంగా 3000 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఇంకోవైపు వివిధ మార్గాల్లో నిధుల సమీకరణ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 30 వేల కోట్ల రూపాయలు సిద్ధం చేసి శరవేగంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని గట్టి సంకల్పంతో ఉంది రాష్ట్ర ప్రభుత్వం.

* ప్రతినిధుల బృందం రాక..
మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్( Singapore) భాగస్వామ్యం కానుంది. ఈరోజు సింగపూర్ కు చెందిన ప్రతినిధుల బృందం అమరావతి రాజధాని లో పర్యటించింది. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తోంది. ప్రధానంగా వరద పోటుకు తట్టుకునే విధంగా తీసుకుంటున్న చర్యలు, పూర్వపు నిర్మాణాల పరిస్థితి వంటివి ఆరా తీస్తోంది ఈ బృందం. అయితే ఇప్పటికే పలుమార్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం కూడా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించింది. చిన్న చిన్న అభ్యంతరాలు తప్ప.. పెద్దవేవి చేయలేదు. ఇప్పుడు కూడా సింగపూర్ ప్రతినిధి బృందం అమరావతి రాజధానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పైగా అమరావతి రాజధాని నిర్మాణంలో ఏపీ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా ఉండడంతో సింగపూర్ ప్రభుత్వం సైతం ఆసక్తి చూపుతోంది.

* అప్పట్లో సింగపూర్ సహకారం..
2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలోనే అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించింది. అప్పట్లో సింగపూర్ సహకారం తీసుకుంది. సీడ్ క్యాపిటల్ కింద 1900 ఎకరాలను కేటాయించింది. అయితే అప్పట్లో రాజధాని నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం అయింది సింగపూర్ ప్రభుత్వం. అయితే వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్ భాగస్వామ్యంతో భారీ అవినీతి జరిగిందని అభియోగాలు మోపింది జగన్ సర్కార్. చంద్రబాబు అరెస్ట్ సమయంలో సింగపూర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అమరావతి రాజధాని నిర్మాణ సమయంలో చంద్రబాబు సింగపూర్ ను అడ్డం పెట్టుకొని భారీగా అవినీతి చేశారని ఆరోపించింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణానికి కదలిక వచ్చింది. కానీ గతంలో వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా చంద్రబాబు సర్కార్ సింగపూర్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.

* ముందుకు వస్తున్న సంస్థలు..
అమరావతి రాజధాని( Amaravathi capital ) నిర్మాణ పనులు పున ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్లో వారి నిర్మాణాలు ప్రారంభించిన చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేటు సంస్థలు సైతం తమ కార్యకలాపాలను మొదలు పెట్టేందుకు సిద్ధపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చూస్తోంది సింగపూర్. తాజాగా ప్రతినిధుల బృందం పరిశీలన తర్వాత కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మొత్తానికి అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సింగపూర్ సైతం సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తోంది.