Amanch Swamulu : ఏపీలో వైసీపీకి షాక్. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత జనసేనలో చేరడానికి రంగం సిద్ధమైంది. వారాహి యాత్ర ప్రారంభానికి ముందే పవన్ వైసీపీకి సవాల్ విసురుతున్నారు. పెద్దఎత్తున చేరికలకు రంగం సిద్ధం చేశారు. జూన్ 14 నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో యాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో చేరికలు కూడా ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో బాపట్ల జిల్లా చీరాలలోని వైసీపీ ముఖ్య నేతగా ఉన్న ఆమంచి స్వాములు జనసేన తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు.ఆమంచి స్వాములు ఎవరో కాదు.. చీరాల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ కు స్వయాన తమ్ముడు.
ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నారు. ఆయన ఆ పదవిలో ఇష్టం లేకుండా కొనసాగుతున్నారన్న టాక్ ఉంది. కృష్ణమోహన్ గెలుపోటములు వెనుక స్వాములు ఉంటారు. అటువంటి స్వాములు జనసేలో చేరుతుండడంపై కృష్ణ మోహన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీరాలలో కృష్ణ మోహన్ కు ప్రత్యేకమైన పట్టు ఉంది. 2000లో వేటపాలెం మండలం జెడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమంచి కృష్ణమోహన్.. మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు ప్రధాన శిష్యుడిగా ఎదిగారు. ఆయన ఆశీస్సులతో 2009లో తొలిసారి చీరాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఆమంచి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2019 ఎన్నికల ముందు తన తమ్ముడు ఆమంచి స్వాములుతో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున చీరాల నుంచి పోటీ చేసి కృష్ణమోహన్ ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం చీరాల నుంచి కృష్ణ మోహన్ ను తప్పించారు. కృష్ణమోహన్ పై గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొందిన కరణం బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా చీరాల నుంచి పోటీకి మొగ్గు చూపుతూ వచ్చారు. ఇలా ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండటంతో జగన్.. కరణం బలరాంకే చీరాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ ఇచ్చారు. ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు నియోజకవర్గ ఇన్ చార్జిగా పంపారు. కానీ ఇది కృష్ణ మోహన్ కు మింగుడుపడడం లేదు. ఎన్నికల ముందు ఆయన వైసీపీని వీడడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ముందుగా ఆయన సోదరుడ్ని జనసేనలోకి పంపించి కర్చీఫ్ వేసుకున్నారని టాక్ నడుస్తోంది.
ఆమంచి స్వాములు జూన్ 12న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. జూన్ 12న మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించనున్నారు. ఆ సమయంలో స్వాములు పార్టీలో చేరనున్నారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను కలిసి ఆమంచి స్వాములు పార్టీలో చేరికకు సుముఖత వ్యక్తం చేశారు. వాస్తవానికి చీరాలలో తన నూతన గృహప్రవేశం రోజున పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించి భారీ బహిరంగ సభ పెట్టాలని ఆమంచి స్వాములు ముందు భావించారు. అయితే సమయాభావంతో బహిరంగ సభను విరమించుకున్నారు. ఓ కీలక నేత పార్టీని వీడుతుండడంతో వైసీపీలో కలవరం ప్రారంభమైంది.