Rajahmundry Central Jail: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు వారాలు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఓ మాజీ సీఎం, దేశంలోనే సీనియర్ నాయకుడుగా పేరు పొందిన చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలు పేరు జాతీయస్థాయిలో మార్మోగింది. నేషనల్ మీడియాలో రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రస్తావన ప్రత్యేకంగా వచ్చింది. అయితే ఈ జైలుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఒక్క చంద్రబాబే కాదు. సీఎంలుగా పని చేసిన ఇద్దరు నేతలు సైతం ఇదే జైల్లో రిమాండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
రాజమండ్రి సెంట్రల్ జైలుకి వందల సంవత్సరాల చరిత్ర. డచ్ వారు 1602 లో రాజమండ్రిలో ఒక కోటను నిర్మించారు. ఆ కోట అనతి కాలంలో జైలు గా మారిందని చరిత్ర చెబుతోంది. బ్రిటిష్ పాలకులు డచ్ వారు నిర్మించిన ఈ కోటను జైలుగా మార్చినట్లు తెలుస్తోంది. 1890లో సెంట్రల్ జైలు గా గుర్తించారు. ఈ లెక్కన ఈ జైలుకు 133 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర. స్వాతంత్ర సమరంలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, వారి సహచరులను రాజమండ్రి జైలుకు ఖైదీలుగా తరలించారు.
దేశంలో అతిపెద్ద జైళ్లలో.. రాజమండ్రి సెంట్రల్ జైలు ఒకటి. విస్తీర్ణపరంగా నాలుగో పెద్ద జైలు. 212 ఎకరాల విస్తీర్ణంలో ఈ జైలు ఉంది. 39 ఎకరాల్లో జైలును నిర్మించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విధంగా దీనిని తీర్చిదిద్దారు. జైలులో దాదాపు 3,000 మంది ఖైదీలను ఉంచడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించారు. స్వాతంత్ర అనంతరం.. దేశంలో జరిగిన పలు ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులను సైతం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సందర్భాలు ఉన్నాయి.
2015లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలును ఆధునీకరించారు. ప్రస్తుతం చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్న స్నేహ బ్లాక్.. ఆయన హయాంలో నిర్మించినదే. అందుకే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన భర్త నిర్మించిన బ్లాక్ లోనే ఆయనను బందీగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక్క చంద్రబాబు కాదు.. ఆయనకు ముందు రాష్ట్రాన్ని పాలించిన ఇద్దరు సీఎంలు రిమాండ్ ఖైదీలుగా ఉండేవారట. ఉమ్మడి ఏపీకి రెండుసార్లు సీఎం గా ఎన్నికైన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కొద్దికాలం పాటు ఈ జైల్లోనే గడిపారు. ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు సైతం ఇదే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండేవారట. అయితే వీరిద్దరూ ముఖ్యమంత్రులు కాక మునుపు జైలు జీవితం గడిపారు. చంద్రబాబు మాత్రం తాను సీఎంగా ఉన్నప్పుడు అవినీతి చేశారన్న ఆరోపణలపై జైలుకు వెళ్లడం విశేషం.