AP Election survey : ఏపీలో ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. పోలింగ్ కు మరో రెండు వారాల వ్యవధి మాత్రమే ఉంది. మే 11 వరకు ప్రచారానికి అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ముమ్మర ప్రచారం చేపడుతున్నాయి. గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ భావిస్తుండగా.. గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజలు తమను ఆదరిస్తారని కూటమి పార్టీలు ఆశిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఏఎల్ఎన్ సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆ సంస్థ సర్వే చేపట్టినట్లు తెలిపింది. ప్రతి నియోజకవర్గంలో 550 శాంపిళ్లను ప్రజల నుంచి సేకరించినట్లు స్పష్టం చేసింది సదరు సంస్థ.
అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చేసిన ఈ సర్వేలో వైసిపి ఏకపక్ష విజయం దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 149 చోట్ల వైసిపి అభ్యర్థులు విజయం సాధిస్తారని సర్వే తేల్చి చెప్పింది. బిజెపి, జనసేనతో కూటమి కట్టిన టిడిపి కేవలం 26 స్థానాలకు పరిమితం కానుందని కూడా తేల్చేసింది. 79 నియోజకవర్గాల్లో 10,000 మెజారిటీకి పైగా సాధిస్తుందని, మరో 57 సీట్లకు సంబంధించి ఐదు నుంచి పదివేల ఓట్ల మెజారిటీ దక్కించుకోనుందని.. 13 చోట్ల మాత్రం 5000 లోపు ఓట్ల మెజారిటీ వైసిపి దక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పడం విశేషం.
51% ఓట్లతో వైసిపి తిరుగులేని విజయం సాధిస్తుందని ఏఎల్ఎన్ సర్వే సంస్థ తేల్చి చెప్పింది. టిడిపి కూటమి 41% ఓట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నాలుగు శాతం ఓట్లు సాధిస్తుందని, ఇతరులు ఒక శాతం ఓట్లు సాధిస్తారని స్పష్టం చేసింది. అయితే ఈ సర్వేలో ఇండియా కూటమికి నాలుగు శాతం ఓట్లువస్తాయని తేలడం విశేషం.అయితే కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఓట్లు చీల్చుతుందని.. కానీ అవి వైసిపివి కాకుండా కూటమివని ఈ సర్వే చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రధాన అనుచరుడు సునీల్ బన్సల్.. ఏపీలో గెలవబోయేది కూటమి అని.. జూన్ 9న చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పుకొచ్చారు. కేంద్రం వద్ద కూడా పక్క సమాచారం ఉందని స్పష్టం చేశారు. ఇలా ఆయన ప్రకటనకు ఒకరోజు వ్యవధిలోనే ఈ సర్వే రావడం విశేషం.