Miracle: భూమ్మీద ఉన్న ప్రతి జీవి మరణించాల్సిందే. అయితే కొందరు ఎక్కువ రోజులు బతుకుతారు. మరికొందరు తక్కువ రోజులు బతుకుతారు. కానీ మరణం మాత్రం పక్కా. అది వీధి రాత కూడా. అయితే చాలామంది మరణం అంచుల దాకా వెళ్లి బతికి బట్ట కడతారు. అత్యవసర వైద్యంతో కొందరు, బతకాలన్న ఆకాంక్షతో మరికొందరు బయటపడతారు. దీనిని పునర్జన్మగా అభివర్ణిస్తారు. అయితే ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది సార్లు పునర్జన్మ ఎత్తాడు అమెరికాలోని న్యూ జెర్సీ నివాసి ఇవాన్ హోయిట్ వాసర్ స్ట్రోమ్. ఇవాన్ ఒకసారి కాదు రెండుసార్లు కాదు మొత్తం ఎనిమిది సార్లు మరణించాడు. మరణం అంచులకు వెళ్ళాడు. మళ్లీ ప్రాణం నిలుపుకున్నాడు. చనిపోయాడు అనుకున్న ప్రతిసారి జీవించాడు. వృత్తిరీత్యా ఆయన రచయిత. నిర్మాత కూడా.
40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు తన ఎడమ చాతిలో మంట వచ్చింది. వెంటనే నైన్ డబల్ వన్ కి కాల్ చేసి చెప్పాడు. అక్కడికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అంబులెన్స్ లోనే ఆయన శ్వాస నిలిచిపోయింది. అక్కడకు కొద్దిసేపటికి మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. ఇలా ఐదుసార్లు ఆయన ప్రాణంపోయినట్టే పోయి.. మళ్లీ చలనం వచ్చింది. అతడి పరిస్థితిని చూసిన వైద్య సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అన్నింటికీ మించి ఆశ్చర్యపడ్డారు.
అంబులెన్స్ దిగిన తర్వాత, ఆపరేషన్కు వెళ్లే ముందు కూడా ఇవాన్ శ్వాస రెండు నిమిషాల పాటు ఆగిపోయింది. దీంతో ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఏకంగా ఐదు రోజులపాటు కోమాలోకి వెళ్లడంతో ఎక్మో మిషన్లో ఉంచారు. దీంతో ఆయన గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది. ఇవాన్ శ్వాస సరిగ్గా పనిచేయడం మొదలైంది. అతడు ఎక్కువ కాలం జీవించగలడని కూడా వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఇవాన్ ఉన్నాడు. కనీసం నడవడానికి, మాట్లాడడానికి రెండేళ్లు పడుతుందని వైద్యులు చెప్పుకొచ్చారు. కానీ ఇవాన్ మాత్రం ఒకటిన్నర రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నాడు. నడవడం, మాట్లాడడం ప్రారంభించాడు. ఇంకేముంది వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. మొత్తానికైతే వైద్యులకే ఆశ్చర్యం వచ్చేలా ఇవాన్ మృత్యుంజయుడుగా బయటపడడం విశేషం.