Flight and Helicopter accidents:దేశంలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు అనేకమందిని పొట్టన పెట్టుకున్నాయి. ప్రమాదాలతో చాలామంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ జాబితాలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. గాలిలో వెళుతూ సాంకేతిక లోపంతో విమానాలతో పాటు హెలిక్యాప్టర్లు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. దీంతో ప్రముఖుల ప్రాణాలు గాలిలోనే కలిసిపోతున్నాయి. అయితే ఉజ్వలమైన భవిత ఉన్నవారు సైతం ఇలా ప్రాణాలు కోల్పోతుండడం విషాదం నింపుతోంది. ఈరోజు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ విమాన ప్రమాదంలో మరణించారు. దీంతో విమాన ప్రమాదాలపై బలమైన చర్చ జరుగుతోంది.
* లోక్సభలో స్పీకర్ గా వ్యవహరిస్తున్న జీవీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఉమ్మడి ఏపీ నుంచి ఎన్నికైన తొలి లోక్సభ స్పీకర్ ఆయనే. అమలాపురం ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహించేవారు. సొంత నియోజకవర్గానికి హెలిక్యాప్టర్ పై వస్తున్న క్రమంలో 2002 మార్చి 3న ప్రమాదానికి గురయ్యారు. సాంకేతిక లోపం తలెత్తి హెలిక్యాప్టర్ కొబ్బరి చెట్లను ఢీకొట్టడంతో కూలిపోయింది. ఆ ప్రమాదంలో బాలయోగి మరణించారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉండగా ఆయన అకాల మరణం చెందారు.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. 2009 సెప్టెంబర్ 2న ఆయన ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ కర్నూలు జిల్లాలోని రుద్ర కొండ సమీపంలో ప్రమాదానికి గురైంది. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం కోసం వెళుతూ ఆయన ఈ ప్రమాదంలో మృతి చెందారు. ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల కారణంగా నియంత్రణ కోల్పోయిన హెలిక్యాప్టర్ ప్రమాదం బారిన పడింది. రెండోసారి ఏపీలో అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే ఆ మహానేత ప్రమాదానికి గురయ్యారు.
* 2004 ఎన్నికల సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు ప్రముఖ హీరోయిన్ సౌందర్య. బిజెపి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆమెతో పాటు సోదరుడు అమర్నాథ్ కూడా మృతి చెందారు.
* కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు మాధవరావు సింధియా. ఆయన సైతం 2001లో విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పూరి వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయారు.
* మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ సైతం విమాన ప్రమాదంలోనే చనిపోయారు. 1980లో విమానం నడుపుతూ వెళుతుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో సంజయ్ గాంధీ చనిపోవడం అప్పట్లో విషాదం.
* 2021 లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యులు సైతం చనిపోయారు.
* 2011లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న డోర్జీ ఖండూ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ కనిపించకుండా పోయింది. ఐదు రోజుల తర్వాత దాని శకలాలు లభ్యమయ్యాయి. ఇలా హెలిక్యాప్టర్, విమాన ప్రమాదాల్లో రాజకీయ, సినీ ప్రముఖులు అకాల మరణం చెందారు.