Heat Waves: ఆంధ్రప్రదేశ్ రెండు రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. స్నానం చేసి బట్టలు వేసుకునేలోపే చమట ధారలు కారుతోంది. రోహిణి కార్తె కావడంతో రోళ్లు పగిలే ఎండతో ఉదయం కూడా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. రోహిణి కార్తె ఎండలకు రేమాల్ తఫాన్ తోడవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ ప్రకటించింది.
6 డిగ్రీలకుపైగా పెరిగిన టెంపరేచర్..
బంగాళాఖాతంలో ఏర్పడిన రేమాల్ (Remal) తుఫాన్ ఆదివారం(మే 26) అర్ధరాత్రి తీరం దాటింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక రోహిణి కార్తెకు రెమాల్ తుపాను తోడవడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్..
రోహిణి కార్తెలో రోకళ్లు పగిలే ఎండ కొడుతుందని అంటారు. దానిని ఏపీలో ఉష్ణోగ్రతలు నిజం చేస్తున్నాయి. రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలు పెరుగుతాయని వాటి ధాటికి రోకళ్లు, రాళ్లు కూడా పరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాబోయే రెండు మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
బయటకు రావొద్దు..
అతి తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచిస్తోంది. మబ్బు పట్టినా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని పేర్కొంది. ఉక్కపోతతో శరీరంలోని నీరు బయటకు వెళ్తుందని, డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఇలాంటి ఎండల్లో తిరిగితే సాయంత్రానికి నీరసపడతారని పేర్కొంది. ద్రవ ఆహారం ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.