https://oktelugu.com/

Jogi Ramesh : అగ్రిగోల్డ్ భూములు అమ్మేశారా? జోగి రమేష్ చుట్టూ ఉచ్చు.. ఏసీబీ రైడ్స్!

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం దశాబ్ద కాలంగా నానుతూనే ఉంది. 2019 ఎన్నికల్లో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం తేల్చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మరిచిపోయారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 13, 2024 / 12:09 PM IST

    Jogi Ramesh

    Follow us on

    Jogi Ramesh : లేదు లేదంటూనే కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను వెంటాడుతోంది.మొన్న వల్లభనేని వంశీ,నిన్న కొడాలి నాని, నేడు జోగి రమేష్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.జోగి రమేష్ వైసీపీలో కీలక నేత. జగన్ క్యాబినెట్లో సైతం చోటిచ్చారు. అప్పట్లో జగన్ పై వ్యాఖ్యలు చేశారంటూ మంగళగిరిలోని చంద్రబాబు నివాసానికి దండెత్తారు జోగి రమేష్. వందలాది వాహనాలతో హల్ చల్ చేశారు. చంద్రబాబు ఇంటి పై దాడి చేసినంత ప్రయత్నం చేశారు. అప్పట్లోనే జోగి రమేష్ పేరు మార్మోగింది. విస్తరణలో మంత్రి పదవి దక్కింది. అప్పటినుంచి చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. పవన్ కళ్యాణ్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అధినేత జగన్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు. వివాదాస్పదమైన వైసీపీ నేతల్లో జోగి రమేష్ చేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు టార్గెట్ అయ్యారు. ప్రజా దర్బార్లో ఆయన అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. గత 24 గంటలుగా జోగి రమేష్ ఇళ్లతో పాటు కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో జోగి రమేష్ అరెస్ట్ ఉంటుందని ప్రచారం ప్రారంభమైంది. ముఖ్యంగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం జోగి రమేష్ మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో కుటుంబ సభ్యుల పేరుతో అగ్రిగోల్డ్ భూములను రాయించుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వీలైనంతవరకు పూర్తి ఆధారాలు సేకరించి జోగి రమేష్ అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.

    * ఆయన స్టైల్ వేరు
    వైసిపి హయాంలో ప్రత్యర్థులపై విరుచుకు పడడంలో జోగి రమేష్ స్టైల్ వేరు. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతం కావడంతో.. అప్పట్లో ప్రతి దానికి రెచ్చిపోయేవారు.జోగి రమేష్ దూకుడు చూసే జగన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.అయితే మంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అగ్రిగోల్డ్ భూములను కైవసం చేసుకున్నా జగన్ పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో పెనమలూరు టికెట్ ఇచ్చి మరి ప్రోత్సహించారు. అయితే జోగి రమేష్ నిర్వాకం తెలిసిన ప్రజలు దారుణంగా ఓడించారు.

    * ప్రధాన ఆరోపణలు అవే
    తన కుటుంబ సభ్యుల పేరుతో అగ్రిగోల్డ్ భూములు రాయించుకున్నారు అన్నది జోగి రమేష్ పై ఉన్న ప్రధాన ఆరోపణ. నిషేధిత జాబితాలో ఉన్న భూములను మార్చి.. తన కుటుంబ సభ్యుల పేరుతో మార్చుకున్నారని అగ్రిగోల్డ్ బాధితులు బాహటంగానే ఆరోపణలు చేశారు. కానీ జగన్ సర్కార్ కనీసం పట్టించుకోలేదు. దర్యాప్తు చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను బుట్ట దాఖలు చేశారు.ఇప్పుడు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో దీనిని సీరియస్ అంశంగా తీసుకొని ఏసీబీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.

    * ఏసీబీ సోదాలు
    ప్రస్తుతం జోగి రమేష్ ఇంటితో పాటు కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. 15 మంది అధికారులతో కూడిన బృందం ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్న అగ్రిగోల్డ్ భూములు ఎప్పటికీ అమ్మేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారుల సోదాల్లో ఏం దొరుకుతుంది? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అన్నది హాట్ టాపిక్ గా మారింది.