Jogi Ramesh Family : మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో పడింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ రెచ్చిపోయారు. చంద్రబాబు ఇంటి పైకి దండెత్తారు. వందలాది వాహనాల్లో వెళ్లి దాడి చేసినంత ప్రయత్నం చేశారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఫిర్యాదు చేసినా వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జోగి రమేష్ టార్గెట్ అయ్యారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది అధికారులు సైతం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అందుకే అరెస్టుల పర్వం ప్రారంభించింది. మంగళవారం వేకువ జాము నుంచే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేసింది. కీలక రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అదుపులోకి తీసుకోవడం సంచలనం రేకెత్తించింది. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భూములకు సంబంధించి తొమ్మిది మందిపై కేసు నమోదయింది. ఏ 1 గా రాజీవ్, ఏ 2గా జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావు పేరును చేర్చారు. వీరిపై ఐపిసి 420, 409, 467, 471, 120(బి) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వేకువ జాము నుంచి సోదాలు జరుగుతుండగా.. మధ్యాహ్నం రాజీవ్ ను అదుపులోకి తీసుకొని గొల్లపూడి లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
* సహకరించిన వారిపై కేసులు
మొత్తం తొమ్మిది మందిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్, జోగి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి మోహన రంగ దాస్, వెంకట సీతామహాలక్ష్మి, సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్, డిప్యూటీ తహసిల్దార్ విజయ్ కుమార్, విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులను నిందితులుగా చేర్చారు. అగ్రిగోల్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి మార్చి.. జోగి రమేష్ కుటుంబ సభ్యుల పేరిట మార్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేయడం విశేషం.
* కొద్దిసేపటికే అరెస్ట్
వేకువ జాము నుంచి సోదాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇంత వేగంగా అరెస్టులు ఉంటాయని ఊహించలేదు. కానీ రికార్డులు పరిశీలించిన గంట వ్యవధిలోనే రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను మరికొంతమందితో కలిసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రాజీవ్ మాట్లాడాడు. తన తండ్రి పై ఉన్న కక్షతోనే అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. త్వరలో ఈ కేసులో మిగతా నిందితులను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
*విజయవాడ నడిబొడ్డున ఉరి తీయండి
కుమారుడు రాజీవ్ అరెస్టుపై జోగి రమేష్ స్పందించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో తనతో పాటు కుటుంబం ఎటువంటి తప్పిదాలకు పాల్పడలేదన్నారు. తామ తప్పును నిరూపిస్తే విజయవాడ నడిరోడ్డులో ఉరేసుకుంటానని స్పష్టం చేశారు. బీసీ వర్గాలకు చెందిన తమను వేధించడం దారుణమన్నారు. చిన్నపిల్లడు అని కూడా చూడకుండా అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. పైన దేవుడు ఉన్నాడని.. అన్ని చూస్తున్నాడని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తన వంకర బుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు.