Chandrababu Vs YS Jagan : ఏ1 చంద్రబాబు.. షాకిచ్చిన జగన్

పక్కా ఆధారాలు సేకరించి చంద్రబాబుపై ముప్పేట దాడికి సీఐడీ సిద్ధమైంది. అయితే నాడు సీబీఐ ద్వారా తనను ఇరికించిన చంద్రబాబుపై.. ఇప్పుడు జగన్ సీఐడీ ద్వారా ఆ ప్రయత్నం చేస్తున్నారన్న మాట.

Written By: Dharma, Updated On : July 1, 2023 5:36 pm
Follow us on

Chandrababu Vs YS Jagan : రాజకీయాల్లో ఎవరి అవకాశాలు వారివి. ఎవరికి ఎప్పుడు అవకాశముంటే అప్పుడు ప్రత్యర్థిని ఇరికిస్తారు. తనపై కేసులకు, జైలు జీవితానికి చంద్రబాబు ప్రధాన కారణమని జగన్ భావిస్తుంటారు. తనకు మించి ఆయన కూడా కేసులపాలు కావాలని చూస్తుంటారు. ఇప్పుడు అటువంటి అవకాశమే జగన్ కు వచ్చింది. తనవలే చంద్రబాబును కూడా ఏ1 ముద్దాయిగా చూపించే ప్రయత్నం చేశారు. అందులో కొంత సక్సెస్ కూడా అయ్యారు. ఏదైనా కీలక కేసులో చంద్రబాబును ఏ 1 ముద్దాయిగా చూపాలనుకున్న జగన్ కు అమరావతిలో క్విడ్ ప్రో కేసు కలిసొచ్చింది. అందుకే ఏ 1గా చూపి కేసును మరింత బిగుసుకునే చేయాలన్న ప్రయత్నంలో జగన్ ఉన్నారు.

అసలు మూడు రాజధానుల అంశాన్ని జగన్ సర్కారు బయటకు తీసుకొచ్చింది చంద్రబాబుపై ఆరోపణలతోనే. అప్పట్లో అమరావతిలో అంతులేని అవినీతి జరిగిందని జగన్ అండ్ కో ఆరోపణలు చేస్తూ వచ్చింది. కానీ తొలినాళ్లలో ఎంత ప్రయత్నించినా రుజువు చేయలేకపోయింది. అందుకు సంబంధించిన అంశాలను బయటపెట్టలేకపోయింది. ఎప్పుడైతే నిబంధనకు విరుద్ధంగా కరకట్టలపై లింగమనేని గెస్ట్ హౌస్ కనిపించిందో.. అప్పటి నుంచే దాని వెనుక ఉన్న కథను బయటపెట్టే ప్రయత్నం చేసింది. లింగమనేనికి అమరావతిలో ఆయాచిత లబ్ధి చేకూర్చి క్విడ్ ప్రోలో భాగంగా గెస్ట్ హౌస్ ను చంద్రబాబు తీసుకున్నారని అభియోగం మోపి కేసుకు మరింత బలం చేకూర్చేలా చేసింది.

తొలుత తన చేతిలో ఉన్న సీఐడీని జగన్ చంద్రబాబుపై ప్రయోగించారు. శూలశోధన చేయించారు. లింగమనేని గెస్ట్ హౌస్ ఒక వైపు.. అప్పటి మంత్రి నారాయణ కుటుంబసభ్యుల ఆస్తులు మరోవైపు సీఐడీకి కనిపించాయి. వాటి గుట్టును బయటపెట్టి చంద్రబాబును సీఐడీ ఇరుకునపెట్టింది. లింగమనేని రమేష్ బినామీగా చంద్రబాబు భారీగా ఆస్తులు కూడబెట్టారన్నది ప్రభుత్వ వాదన. అందుకే ఇన్నర్ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ సైతం మార్చారని వైసీబీ చెబుతోంది. తన ఆస్తు విలువ పెంచుకునేందుకు రైతులకు నష్టం చేస్తూ రాజధాని ప్లాన్ మార్చారంటోంది. లింగమనేని వద్దే హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేశారని.. హెరిటేజ్ సంస్థలో అప్పటికే చంద్రబాబు తనయుడు లోకేశ్ డైరెక్టర్‌గా ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించి చంద్రబాబుపై ముప్పేట దాడికి సీఐడీ సిద్ధమైంది. అయితే నాడు సీబీఐ ద్వారా తనను ఇరికించిన చంద్రబాబుపై.. ఇప్పుడు జగన్ సీఐడీ ద్వారా ఆ ప్రయత్నం చేస్తున్నారన్న మాట.