Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి ( Y S Vivekananda Reddy ) హత్య కేసులో కీలక మలుపు. ఈ కేసులో ప్రధాన సాక్షి రంగన్న మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడప రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కీలక సాక్షి కావడంతో ప్రభావం తప్పకుండా ఉంటుంది. కొద్ది రోజులుగా పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన.. నయం కాకపోవడంతో కడప రిమ్స్ లో చేరారు. గుండె, శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కీలక సాక్షి కావడంతో అధికారులు 1+1 భద్రత కల్పించారు. కాగా రంగన్న వివేకానంద రెడ్డి ఇంట్లో వాచ్మెన్ గా పనిచేసేవారు.
Also Read: నాగబాబుకు ఎమ్మెల్సీ.. కేఏ పాల్ ఆగ్రహం.. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు
* 2019 ఎన్నికల్లో ప్రభావం
2019 మార్చి 15న వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉన్నారు. అప్పట్లో ఈ కేసు విచారణను సిబిఐ కి( CBI) అప్పగించింది అప్పటి ప్రభుత్వం. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రచార అస్త్రంగా మార్చుకుంది. విపరీతమైన సానుభూతి పనిచేసింది. ఆ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. అయితే ఈ కేసు విచారణ ముందుకు సాగుతుందని అంతా భావించారు. కానీ గత ఐదేళ్లలో ఒక్క అడుగు ముందుకు వేస్తే 6 అడుగులు వెనక్కి అన్నట్టు పరిస్థితి మారింది. కేసు విచారణలో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది.
* ఈ ఎన్నికల్లో ప్రతికూలత
2024 ఎన్నికల్లో సైతం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అంశం విపరీతమైన ప్రభావం చూపింది. కడప జిల్లాలో ( Kadapa district )సైతం వైయస్సార్ కాంగ్రెస్ ఓటమికి కారణం అయ్యింది. గత ఐదేళ్ల పరిణామాలు గమనించిన ప్రజలు చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం.. అడుగడుగునా అడ్డగించడంతో ప్రజలు ఈ కేసు విషయంలో ఫుల్ క్లారిటీ కి వచ్చారు. దీనికి తోడు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, జగన్ సోదరి షర్మిల వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని అస్త్రంగా మార్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. దీంతో ప్రజలు కూడా అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి పార్టీని వ్యతిరేకించారు.
* కేసు విచారణలో కానరాని పురోగతి..
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంటుందని అంతా భావించారు. కానీ ఇంతవరకు అటువంటిదేమీ లేకుండా పోయింది. సునీత సైతం అసహనంతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వివేకానంద రెడ్డి కుమార్తె సునీత హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనితను కలిశారు. సీఎం చంద్రబాబును కలిసి కేసు శరవేగంగా దర్యాప్తు చేపట్టాలని కోరారు. కానీ ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఒక రకమైన అసంతృప్తి ఆమెలో కనిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న చనిపోవడం తప్పకుండా ప్రభావం చూపుతుంది. అయితే ఇప్పటికే న్యాయస్థానాలతో పాటు సిబిఐ అధికారుల సైతం ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: ఉత్తరాంధ్రలో కూటమికి షాక్.. మరి వైసీపీ మద్దతు అభ్యర్థి పరిస్థితి ఏంటి?