KTR: తెలంగాణలో దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు పేలతాయని మంత్రులు ప్రకటించినా.. అవి తుస్సుమన్నాయి. కానీ, ఆలస్యంగా అయినా ఓ బాంబు పేల్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ బాంబు బీఆర్‌ఎస్ పెద్ద తలకాయదే అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో గత ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా రేసింగ్‌లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్.. ఓ విదేశీ సంస్థలకు రూ.55 కోట్లు అక్రమంగా కేటాయించడంపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్ విచారణలో కేటీఆర్ ఆదేశం మేరకు డబ్బులు కేటాయించినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ కేసు విచారణకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా దిగింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు కేటాయించినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసు విషయంలో కేటీఆర్‌కు ఉచ్చు బిగస్తున్నట్లు తెలుస్తోంది.
గవర్నర్‌కు లేఖ..
ఈ ఫార్ములా రేసింగ్ కోసం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్లు విదేశీ సంస్థకు కేటాచిండంపై కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను ఈడీ కోరినట్లు తెలిసింది. అమేరకు గవర్నర్‌కు లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయంపై విచారణ జరపాలని ఏసీబీకి ఎంఏయూడీ ఇప్పటికే లేఖ రాసింది. అప్పటి పురపాలక శాఖ కమిషనర్ అరవింద్‌కుమార్‌పై చర్యలకు అనుమతి కోరగా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ధ్రువీకరణ లేకపోయినా కేటీఆర్ అరెస్ట్ కాయమని మీడియా, పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.