Vajpayee statue proposal: గత అనుభవాల దృష్ట్యా బిజెపితో( Bhartiya Janata Party) పటిష్ట బంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు చంద్రబాబు. అందుకు వచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ప్రస్తుతం కూటమి ఉంది ఏపీలో. కచ్చితంగా కూటమి పెద్దగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభావం ఉంటుంది. జాతీయ పార్టీగా ఉన్న బిజెపి ఇదే కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సహకారం ఏపీకి అవసరం. రాజకీయంగాను టిడిపికి ఇది కీలకం. అందుకే కేంద్ర పెద్దలతో సఖ్యతగా మెలుగుతున్నారు చంద్రబాబు. వీలైనంతవరకూ రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు. ఆపై రాష్ట్ర ప్రయోజనాల కోసం నిధులు రాబెడుతున్నారు. అయితే ఇవన్నీ బిజెపి నేతలు సంతృప్తి పడితేనే జరుగుతున్నాయి. అయితే ఈ సంతృప్తి శాతాన్ని మరింత పెంచేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే అమరావతిలో వాజ్పేయి విగ్రహం.
ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయం..
అమరావతి రాజధాని లో ( Amravati capital ) ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సంకల్పించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిని ఎంపిక చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్, గాంధీజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అప్పట్లో అది వీలు కాలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడకు తరలించింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడం.. అమరావతి రాజధాని నిర్మాణం ఊపందుకోవడం వంటి వాటితో ఆ విగ్రహాల ఏర్పాటుకు కదలిక వచ్చింది. అయితే అసలు ప్రతిపాదనలో లేని వాజ్పేయి విగ్రహం ముందుగా ఏర్పాటు చేయడం.. ఆవిష్కరించడం విశేషం. ఈరోజు వాజ్పేయి జయంతి సందర్భంగా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిపి ఏపీ సీఎం చంద్రబాబు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఎన్టీఆర్ ఉండగా..
వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా నందమూరి తారక రామారావు ఉండగా.. వాజ్పేయి( Atal Bihari Vajpayee) విగ్రహానికి ప్రాధాన్యం ఇవ్వడం వెనుక వ్యూహం ఉంది. కేంద్ర పెద్దలు అడిగిందే పొడవుగా వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి మూడు ఎకరాల భూమిని కేటాయించారు. కేవలం కేంద్రంతో మరింత బంధాన్ని ద్రోణం చేసుకునేందుకు ఈ ప్రయత్నం అన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా బిజెపి జైత్రయాత్ర కొనసాగుతోంది. బిజెపి సహకారంతోనే మిత్రపక్షాలు ఘనవిజయాలు సాధిస్తున్నాయి . బీహార్ లో జరిగింది అదే. అయితే గతం మాదిరిగా బిజెపితో గ్యాప్ రాకుండా ఉండాలంటే ఆ పార్టీతో సఖ్యత అవసరం. ఆపై ఏపీలో బిజెపి విస్తరణకు అవకాశం కల్పిస్తేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయ్యేది. బహుశా అదే ఆలోచనతో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు అవకాశం కల్పించారు చంద్రబాబు.