Borugadda Anil Kumar: ఏపీలో వైసీపీకి గట్టి మద్దతు దారుడుగా నిలిచారు బోరుగడ్డ అనిల్ కుమార్. ఆయనపై రౌడీషీట్ కూడా ఉంది. ఆయనకు ఈరోజు కోర్టులో షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగారు బోరుగడ్డ. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. ముఖ్యంగా వైసిపి వ్యతిరేకులను టార్గెట్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఆయన బూతులతో రెచ్చిపోయేవారు. తిట్ల దండకం అందుకునేవారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు చుక్కలు కనబడుతున్నాయి. అప్పట్లో వైసీపీ హయాంలో పెట్టిన సోషల్ మీడియా పోస్టులు, వీడియోలపై రాష్ట్రంలో పలుచోట్ల కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో నెలల తరబడి ఆయన రిమాండ్ ఖైదీగా ఉండి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
* రిమాండ్ ఖైదీగా
ముందుగా అనంతపురం జిల్లాలో ఆయనపై కేసు నమోదు అయ్యింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రస్తుతం బోరుగడ్డ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ బోరుగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. కానీ అందుకు కోర్టు సమ్మతించలేదు. తిరస్కరించింది. అంతటితో ఆగకుండా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిందితుడు బోరుగడ్డ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని ప్రశ్నించింది. ఇలాంటి వారిని క్షమించే ఛాన్స్ లేదని తేల్చి చెప్పింది. మరోవైపు పోలీసులు సైతం పట్టు బిగించారు. బోరు గడ్డపై ఇప్పటికే దాఖలైన కేసుల్లో.. చార్జి షీట్లు కూడా నమోదయినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్ ను తోసి పుచ్చింది. దీంతో బోరుగడ్డ మరింత కాలం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* ఒకే తరహా కేసులు
రాష్ట్రవ్యాప్తంగా బోరుగడ్డపై కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ఒకే తరహా కు చెందినవి. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించినవి. దీనిపై కోర్టు కూడా సీరియస్ గా ఉంది. దీంతో ఇప్పుడే ఆయనకు బెయిల్ లభించే అవకాశం కనిపించడం లేదు. గతంలో బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉండేది. చంద్రబాబు, లోకేష్, పవన్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. ఒకానొక సందర్భంలో వ్యక్తిగత, కుటుంబ దూషణలకు కూడా దిగారు. జగన్ అనుమతిస్తే చంపేస్తానని కూడా హెచ్చరించారు. అటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పుడప్పుడే బోరుగడ్డ అనిల్ కుమార్ కు బెయిల్ లభించే ఛాన్స్ కనిపించడం లేదు.