Alluri Seetharamaraju District : అల్లూరి సీతారామరాజు జిల్లాలో అద్భుత విషయం బయటపడింది. పవిత్ర కార్తీక మాసంలో ఓ రైతు పొలంలో శివలింగం దొరికింది. రైతు పొలం పనులు చేస్తుండగా బయటపడింది. కొయ్యూరు మండలంలోని రేవళ్లు పంచాయితీ కంఠారం శివారులో ఉన్న బంధమామిళ్లలో రైతులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. పాడి పశువులను పెంచి జీవిస్తున్నారు. ఈ క్రమంలో పోడు వ్యవసాయంలో భాగంగా పొలాన్ని దున్నుతున్నారు. ఈ క్రమంలో రైతు వడగం సత్తిబాబు తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన పని ముట్టుకు ఏదో తగిలినట్లు ఆయనకు అనిపించింది. వెంటనే అక్కడ తవ్వి చూస్తే ఒక చిన్న శివలింగం బయటపడింది. చూసేందుకు చిన్న పరిమాణంలో ఉంది. వెంటనే ఆయన ఈ విషయాన్ని ఇతర రైతులకు చెప్పారు. క్రమేపీ స్థానికులకు ఈ విషయం తెలియడం.. కార్తీక మాసం కావడంతో జనాలు తండోపతండాలుగా పొలం వద్దకు చేరుకున్నారు. అక్కడ శివలింగాన్ని చూసి పరమశివుడి స్వయంగా ప్రత్యక్షమైనట్లుగా భావించారు. ప్రస్తుతం ఆ పొలంలో లభ్యమైన శివలింగానికి పూజలు ప్రారంభం అయ్యాయి.
* కార్తీక మాసం కావడంతో
కార్తీక మాసంలో శివుడికి ప్రీతికరమైన రోజులు చాలా ఉన్నాయి. ఈ నెలలో ప్రతి రోజు పర్వదినమే. అందుకే కార్తీక మాసంలో నోములు ఆచరిస్తారు. పూజలు చేస్తారు. అయితే ఈ ఏడాది అయ్యప్ప, భవానీ భక్తుల మాల ధారణ కూడా అధికంగా ఉంది. ఈ తరుణంలో మారుమూల గ్రామంలో శివలింగం బయటపడడంతో పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అక్కడ గుడి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు సైతం ఆరా తీసినట్లు సమాచారం. మొత్తం మీద కార్తీక మాసంలో అద్భుతం జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
* ఆలయాల్లో భక్తులు రద్దీ
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం కావడంతో మూడో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను సైతం నడుపుతోంది. అన్ని పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీలను సైతం అందుబాటులోకి తెచ్చింది.