Krishna District: నిజాయితీగా పని చేస్తుంటే సహచరులే తనను అడ్డుకుంటున్నారని.. మానసికంగా హింసిస్తున్నారని.. పెద్దల పేర్లు చెప్పి నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని హోంగార్డు ఇచ్చిన సెల్ఫీ వీడియో సంచలనం రేపుతోంది.. కేవలం నిజాయితీగా పనిచేస్తుండడంతో తోటి ఇద్దరు హోంగార్డులతో పాటు ఓ మీడియా ప్రతినిధి తనను వెంటాడుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు సదరు హోం గార్డ్. కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఇసుక, రేషన్ బియ్యం, పేకాట వ్యవహారాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయని కూడా ఆ వీడియోలో తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
* తోటి హోంగార్డులే వేధింపులు..
తనను తాను పరిచయం చేసుకున్న హోంగార్డు నరేష్.. తీవ్ర ఆవేదనతో తన బాధను వ్యక్తపరిచారు. తాను అవనిగడ్డలో పనిచేస్తున్నానని.. తోటి హోంగార్డులు దుర్గారావు, జరుగు శ్రీను తో పాటు టీవీ ప్రతినిధి వేధిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అవనిగడ్డలో ఇసుక, రేషన్ బియ్యం, పేకాట విచ్చలవిడిగా నడుస్తోందని చెప్పుకొచ్చారు. నా డ్యూటీ నేను చేసిన నన్ను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా డ్యూటీ నేను చేయడం తప్పా? నేను దళితుడిగా పుట్టడమే తప్పా? అవనిగడ్డలో పనిచేయాలంటే నాయుడు గానే పుట్టాలా? అంటూ తీవ్ర ఆవేదనతో ప్రశ్నించారు హోంగార్డు నరేష్.
* పట్టుకుంటే విడిచిపెట్టారు..
ఇటీవల హోంగార్డు నరేష్ పేకాట ఆడే వారిని పట్టుకున్నారు. కానీ ఎమ్మెల్యే మనుషులమంటూ హోంగార్డు దుర్గారావు విడిచిపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు నరేష్. మోపిదేవి పోలీస్ స్టేషన్లో పనిచేస్తుండగా తనను హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేయించారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని కోరారు. అయితే ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. వాస్తవం అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.