New Zealand Cats: పిల్లి.. అనగానే మనకు పెంపుడు జంతువు గుర్తొస్తుంది. కొందరికి చికాకు వస్తుంది. కానీ న్యూజిలాండ్ వాళ్లకు మాత్రం కనిపిస్తే చంపేయాలనిపిస్తుంది. అయితే వాళ్లు చంపేది సాధారణ పిల్లులను కాదు.. అడవి పిల్లులను. అడవుల్లో ఉంటున్న ఈ పిల్లులు అక్కడి పక్షులను వేటాడి చంపేస్తున్నాయి. పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. అరుదైన జంతుజాలాలు తగ్గిపోవడానికి ఈ అడవి పిల్లులే కారణమని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం 2050 నాటికి న్యూజిలాండ్‌లో అడవి పిల్లులను లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
25 లక్షల అడవి పిల్లులు..
న్యూజిలాండ్ దేశవ్యాప్త అడవుల్లో సుమారు 25 లక్షల అడవి పిల్లులు ఉన్నట్లు అంచనా. ఇవి జీవవైవిధ్యానికి సవాల్‌గా మారాయి. ఇవి స్థానిక పక్షులు, గబ్బిలాలు, ఇతర అరుదైన జాతులను వేటాడుతూ అవి అంతరించి పోవడానికి కారణమవుతున్నాయి. ఇదే సమయంలో అనేక వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. డాల్ఫిన్ల సంరక్షణకు కూడా ఇది ప్రభావం చూపుతోంది.
ప్రిడేటర్ ఫ్రీ దేశంగా..
2050 నాటికి అడవి పిల్లులతోపాటు ఫెర్రెట్స్, స్టోట్స్, వీసెల్స్ వంటి వేటాడే జంతువులను పూర్తిగా తొలగించి, ప్రేడేటర్ లేని దేశంగా మారాలని జంతు సంరక్షణ శాఖ ప్రణాళిక. ఈ ప్రాజెక్ట్‌ను మంత్రి ’స్టోన్ కోల్డ్ కిల్లర్స్’ అని వర్ణించి, రెండున్నర దశాబ్దాల్లో సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. మాంస ఆధారిత ఎరలు, ఆధునిక పద్ధతులతో కార్యాచరణ మొదలైంది. పెంపుడు పిల్లులకు ఎటువంటి ప్రమాదం కలగకుండా రక్షణా చర్యలు తీసుకుంటూ, స్వతంత్రంగా జీవించే వాటినే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కార్యక్రమం విజయవంతమైతే, న్యూజిలాండ్ అడవులు పూర్తి స్థిరత్వం సంతరించుకుంటాయి. పక్షులు, ఇతర స్థానిక జీవులు మళ్లీ వికసించే అవకాశం పెరుగుతుంది. దీర్ఘకాలిక సంరక్షణలో ఇది మాదిరిగా నిలుస్తుంది.