Janasena Glass Symbol: జనసేనను వీడని ‘గాజు గ్లాస్’ కష్టాలు

2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో టిడిపికి మద్దతు తెలిపింది. గత ఎన్నికల్లో మాత్రం పోటీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 130 నియోజకవర్గాలకు పైగా ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు.

Written By: Dharma, Updated On : February 9, 2024 1:33 pm

Janasena Glass Symbol

Follow us on

Janasena Glass Symbol: ఏపీ రాజకీయాల్లో జనసేన కీలకంగా మారింది. బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టేందుకు జనసేన అవసరమని తెలుగుదేశం పార్టీ భావించింది. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. అదే సమయంలో జనసేన ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని.. మరోవైపు బిజెపి కోసం పవన్ ప్రయత్నిస్తున్నారు. అటు టిడిపి, ఇటు బిజెపి మధ్య అనుసంధాన కర్తగా ఉన్నారు. ఆ రెండు పార్టీలు సైతం పవన్ కు సరైన గౌరవం ఇస్తూ వస్తున్నాయి. మూడు పార్టీలు కలుస్తాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జనసేన మరో కష్టంలో చిక్కుకుంది. పార్టీ గుర్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం విశేషం.

2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో టిడిపికి మద్దతు తెలిపింది. గత ఎన్నికల్లో మాత్రం పోటీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 130 నియోజకవర్గాలకు పైగా ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. అప్పట్లో జనసేన విన్నపం మేరకు గాజు గ్లాసును కేటాయించారు. అయితే ఈసీ నిబంధనల మేరకు అనుకున్న ఓట్లు ఆ పార్టీ సాధించలేదు. దీంతో ఎన్నికల సంఘం జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లో చేర్చింది. దీంతో జనసేన పోటీ చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే ఆ పార్టీకి గాజు గ్లాస్ లభించే అవకాశం ఉంది. మిగతా చోట్ల మాత్రం స్వతంత్ర అభ్యర్థులకు సైతం గాజు గ్లాస్ కేటాయించేందుకు ఛాన్స్ ఉంది. దీంతో జనసేన గత ఏడాది డిసెంబర్ 12న ప్రత్యేక దరఖాస్తు అందించింది. తమ పార్టీకే గాజు గ్లాస్ గుర్తును కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. దీంతో జనసేనకు మాత్రమే గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తూ ఈసీ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే గాజు గ్లాస్ గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ రాజమండ్రి కి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అధ్యక్షుడు గత ఏడాది డిసెంబర్ 20న ఈసీకి దరఖాస్తు చేశాడు. అప్పటికే గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో సదరు నేత పిటిషన్ దాఖలు చేశారు. తమకు కాకుండా తమ తరువాత దరఖాస్తు చేసిన జనసేనకు గాజు గ్లాస్ కేటాయించారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ఎలక్షన్ కమిషన్ వివరణ కోరింది. జనసేన విన్నపం మేరకు 2023 డిసెంబర్ 12న జనసేనకు తాము సింబల్ కేటాయించామని.. డిసెంబర్ 20న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఈసీ ప్రస్తావించింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. జనసేన ఇచ్చిన దరఖాస్తును జతచేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ సింబల్ పై ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. అటు జనసేన శ్రేణులు మాత్రం ఆందోళనతో ఉన్నాయి.