https://oktelugu.com/

Kadambari Jetwani Case : ముంబై నటి కేసు కొత్త మలుపు.. పోరాటం చేస్తానంటున్న షర్మిల

వరదలతో చిన్న గ్యాప్. మళ్లీ ముంబై నటి కేసు తెరపైకి వచ్చింది. దర్యాప్తు బృందం పని ప్రారంభించింది. ఇటువంటి పరిస్థితుల్లో పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆమెకు అండగా ఉంటానని ప్రకటించారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 3, 2024 / 05:49 PM IST

    Kadambari Jetwani Case

    Follow us on

    Kadambari Jetwani Case : వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిల విడిచిపెట్టడం లేదు. నాటి వైఫల్యాలను గుర్తు చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. గత కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఆమె.. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నిన్ననే జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ తో పాటు వైసీపీ శ్రేణులు రాజశేఖర్ రెడ్డిని స్మరించుకున్నాయి.పెద్ద ఎత్తున నివాళులు అర్పించాయి. కడప జిల్లాలోని ఇడుపాలపాయలో వైయస్సార్ ఘాట్ వద్ద జగన్, షర్మిల వేరువేరుగా నివాళులు అర్పించారు. మరోవైపు జగన్ విదేశీ పర్యటనకు సిద్ధపడుతుండగా.. షర్మిల ఆయన పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ నటి కాదంబరి జెత్వాని ఎపిసోడ్ ను తెరపైకి తెచ్చారు. ఆమెను కట్టడి చేసేందుకు పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారని ఆరోపించారు. గత కొద్దిరోజులుగా ఈ ముంబై నటి వ్యవహారం పెను దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ముంబైలో పారిశ్రామికవేత్త పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఆమెను విజయవాడ తీసుకొచ్చి వేధింపులకు గురి చేశారు. ఓ అక్రమ కేసును పెట్టి మానసికంగా వేధించారు. జైలులో పెట్టి భయపడేలా చేశారు. ముంబైలో పెట్టిన కేసును విత్ డ్రా చేసుకునేలా ఒత్తిడి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు తెరపైకి వచ్చింది. బాధితురాలు నేరుగా వచ్చి తనకు జరిగిన అన్యాయంపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ముగ్గురు ఐపీఎస్ ల అతి ప్రమేయాన్ని ఆమె ప్రస్తావించారు. మరోవైపు నాటి ప్రభుత్వ పెద్దల్లో ఒకరి పేరు వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ కూడా ప్రారంభమైంది. ఇంతలో వరదల కారణంగా ఈ అంశం మరుగున పడింది. ఈరోజు మరోసారి బాధితురాలు పోలీసులు ముందుకు రావడంతో మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఈ ఘటనపై స్పందించారు.

    * జగన్ కు అన్యాయం తెలియదా
    ఒక మహిళను బలవంతంగా ముంబై నుంచి విజయవాడ తీసుకొచ్చి వేధించడం దుర్మార్గపు చర్యగా షర్మిల అభివర్ణించారు. జగన్ ఆదేశాలు లేకుండా సీనియర్ ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగుతారా? అని ప్రశ్నించారు. ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్.. జెత్వానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. ఈ వ్యవహారంపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి తాను అండగా ఉండి పోరాటం చేస్తానని షర్మిల స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లు అయ్యింది. అయితే షర్మిల అంత ఈజీగా వదిలే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

    * వైసీపీ నేత కేసు ఫేక్
    ఇప్పటికే ఈ కేసు విషయంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు బయటకు వచ్చాయి. నాటి ప్రభుత్వం ఒత్తిడితోనే వారు అలా వ్యవహరించినట్లు తేలింది. మరోవైపు ముంబై నటిపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు కూడా ఫేక్ అని తేలుతోంది. తమ సంతకాలు ఫోర్జరీ చేశారని.. తమ ఆధార్ కార్డులు దుర్వినియోగం చేశారని.. తమకు ఎవరు భూములు విక్రయించలేదని ఓ ఇద్దరు వ్యక్తులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికే ఫేక్ ధ్రువపత్రాలతో తన భూమి అన్నారని కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జెత్వానికి రిమాండ్ విధించారు. ఇప్పుడు అదే వ్యక్తులు తమకు ఎవరు భూములు అమ్మే ప్రయత్నం చేయలేదని చెప్పడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.

    * సీరియస్ గా దర్యాప్తు
    కూటమి ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దర్యాప్తునకు ప్రత్యేక అధికారిని నియమించింది. ఇప్పటికే సదరు అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఈ కేసులో బాధితురాలిని తెచ్చి వేధించినట్లు రుజువు అయితే.. నాటి ప్రభుత్వ పెద్దలపై కూడా కేసులు నమోదు చేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే అరెస్టులు కూడా ఉంటాయని ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బాధితురాలికి అండగా ఉంటానని షర్మిల ప్రకటించడం విశేషం.