TTD: టీటీడీ అనూహ్య నిర్ణయాలను తీసుకుంటోంది. ముఖ్యంగా భక్తులకు శ్రీవారి దర్శనం విషయంలో చాలా మార్పులకు రంగం సిద్ధం చేస్తోంది. వసతి విషయంలో సైతం ప్రత్యేక ఆలోచన చేసింది. బ్రేక్ దర్శనాలపై కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. సాధారణంగా బ్రేక్ దర్శనాలకు డిమాండ్. అందుకే ఆన్లైన్ లోనే బ్రేక్ దర్శనాల బుకింగ్ అమలు చేయనుంది. మూడు నెలల ముందు దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తూ వస్తోంది టీటీడీ. అయితే ఇటీవల సిఫారసు లేఖలతో దర్శనాలకు వచ్చే వారి సంఖ్య క్రమేపి పెరుగుతోంది. దీనికి తోడు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు అనుమతించేలా టీటీడీ నిర్ణయించింది. ఇలా లేఖల ద్వారా తిరుమల వస్తున్న వారి నుంచి టీటీడీ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఈ విధానంలో మార్పులకు టీటీడీ శ్రీకారం చుట్టింది.
* నేరుగా ఆన్ లైన్ లో బుకింగ్
సిఫారసు లేఖలు సమర్పించి బ్రేక్ దర్శన టికెట్లు పొందేలా ఇప్పటివరకు పద్ధతి నడుస్తోంది. అయితే ఇకనుంచి ప్రజాప్రతినిధులే నేరుగా బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకునేలా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. శ్రీవారిని నిత్యం 60 నుంచి 70 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. వారాంతం తో పాటు విశేష పర్వదినాల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుంది. అయితే స్వామివారి దర్శనానికి వచ్చిన వారిలో సగానికి పైగా ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో వస్తున్న వారే. దీంతో టీటీడీ వర్గాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ పునరాలోచనలో పడింది. గతంలోనే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారుచేసి టీటీడీ బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులకు యూజర్ ఐడి, పాస్ వర్డ్ కేటాయించింది. ఈ విధానం ద్వారా బోర్డు సభ్యులు తమ కోటాకు తగ్గినట్టు వారే ఆన్లైన్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకుని భక్తులకు అందించేవారు. ఇప్పుడు అదే విధానం అందరూ ప్రజాప్రతినిధులకు అమలు చేయాలని టిటిడి భావిస్తోంది.
* ఆ విమర్శలతోనే
గత ఐదేళ్ల వైసిపి పాలనలో టీటీడీ బ్రేక్ దర్శనాలు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆన్లైన్ విధానం ద్వారా విఐపి బ్రేక్ దర్శనాలు కల్పిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈసారి కొత్తగా కసరత్తు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు లేకుండానే… ముందుగానే దర్శనం పై భక్తులకు స్పష్టత వచ్చేలా ఇది ఎంతో మేలైన విధానం అని టిటిడి వర్గాలు భావిస్తున్నాయి. అందుకే వీలైనంత త్వరగా అమలు చేయాలని భావిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్.