Gautam Gambhir: ఒకప్పుడు వరుస విజయాలతో టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానంలో ఉండేది. ఈసారి కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్తుందనే అంచనా సగటు అభిమానిలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం మారిపోయింది. ఓడలు బండ్లు అవుతాయి అనే సామెత కళ్ళ ముందు కనిపిస్తోంది. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లాలంటే త్వరలో జరిగే సిడ్నీ టెస్టులో కచ్చితంగా గెలవాలి. లేకపోతే పెట్టే బేడా సర్దుకుని రావాలి.
గత రెండు పర్యాయాలు టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలు గెలిచింది. బలమైన ఆస్ట్రేలియాను వారి సొంత దేశంలో మట్టికరిపించింది. కానీ ఈసారి మాత్రం ఆ స్థాయిలో ఆడ లేకపోతోంది. పెర్త్ టెస్టులో 295 రన్స్ తేడాతో గెలిచి విపరీతమైన ఊపులో కనిపించిన టీమిండియా.. ఆ తర్వాత అదే ఉత్సాహాన్ని కొనసాగించలేకపోతోంది. బ్రిస్ బేన్ టెస్టు మినహా మిగతా అన్నింటిలో విఫల ప్రదర్శన కొనసాగించింది. ముఖ్యంగా మెల్ బోర్న్ టెస్టులో అయితే.. దారుణంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్ల ఎదుట సాగిల పడిపోయింది. ఒకరి వెంట ఒకరు అవుట్ కావడంతో టీమిండియా దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది. టీమిండియా ఇప్పుడున్న పరిస్థితుల్లో సిడ్నీ టెస్టులో గొప్ప ఫలితం సాధిస్తుందనే నమ్మకం మాత్రం సగటు భారతీయ అభిమానుల్లో అయితే లేదు. ఓటమి నుంచి తప్పించుకుంటే అదే పది వేలు అన్నట్టుగా అభిమానుల తీరు ఉంది. టీమిండియాకు సిడ్నీ టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి..కోచ్ గౌతమ్ గంభీర్ సరికొత్త ప్రణాళికను తెరపైకి తీసుకొచ్చాడు.
వద్దన్నారట
జాతీయ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్.. సిడ్నీ టెస్ట్ కు జట్టులోకి పూజారను తీసుకోవాలని భావించాడట. ఇదే విషయాన్ని సెలక్టర్ల దృష్టికి తీసుకెళ్తే వారు నిర్ద్వంద్వంగా తోసి పుచ్చారట. ఇప్పట్లో జట్టులో ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారట. ఇదే విషయాన్ని జాతీయ మీడియా తన కథనంలో స్పష్టం చేసింది. అయితే ఇటీవల టీమిండియా వరుస ఓటములు ఎదుర్కొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పూజారకు, రహానే కు అనుకూలంగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. టీమిండియాలోకి కచ్చితంగా వారు రావాలంటూ పేర్కొంటున్నారు. ఈ విషయం గౌతమ్ గంభీర్ దృష్టికి కూడా వెళ్లడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గత సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో పూజార ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విఫలమయ్యాడు. అతడు రెండు ఇన్నింగ్స్ లలో కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో టీమిండియా రెండవ సారి కూడా టెస్ట్ గదను అందుకోలేకపోయింది. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో.. రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈసారి ఫైనల్స్ వెళ్లి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్న తరుణంలో.. వరుస ఓటములు టీం ఇండియా కలను కల్లలు చేస్తున్నాయి. మరోవైపు టీమ్ ఇండియా సిడ్నీ టెస్ట్ కోసం ఇప్పటికే మెల్ బోర్న్ నుంచి బయలుదేరి వెళ్లిపోయింది. కిడ్నీ మైదానంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆటగాళ్లు నెట్స్ లో విపరీతంగా కష్టపడుతున్నారు.