Vijayawada : నడిచే రైలు నుంచి దూకి.. 10 గంటల పాటు నరకయాతన.. చివరకు అలా!*

గత కొంతకాలంగా ఆమె మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో ఉంది. ఈ క్రమంలో రైలు ఎక్కింది. నడిచిన రైలు నుంచి కిందకు దూకింది. అయినా సరే మృత్యుంజయురాలిగా నిలిచింది.

Written By: Dharma, Updated On : November 4, 2024 2:19 pm

Vijayawada

Follow us on

Vijayawada :  నడిచే రైలులో నుంచి ఓ వివాహిత కాలువలోకి దూకేసింది. కొద్ది దూరం కొట్టుకుపోయింది. కొంత దూరం వెళ్ళాక ఓ చెట్టు కొమ్మ ఆసరాతో ఉండిపోయింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 10 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంది. చెట్టుకొమ్మను రాత్రంతా గడిపిన ఆ మహిళను ఉదయం చూసిన స్థానికులు కాపాడారు. పోలీసుల సాయంతో బయటకు తీశారు. విజయవాడ నగరంలో వెలుగు చూసింది ఈ ఘటన. ఎందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా భట్టిప్రోలు కు చెందిన షేక్ ఖాదర్ వలీ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అదే జిల్లా నిజాంపట్నంలో నివాసం ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా ఖాదర్ వలీ భార్య జిన్నా తునిషా మానసిక వ్యాధితో బాధపడుతోంది. దీనికోసం మందులను సైతం వాడుతోంది. ఇటీవల ఆమె మానసిక స్థితి మరింత దిగజారింది. రోజులో కొన్ని గంటల పాటు బాగానే ఉంటున్నారు. మిగతా సమయంలో మాత్రం ఆమె మానసిక స్థితి బాగా ఉండటం లేదు. ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది.ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. కుటుంబ సభ్యులు తిరిగి చేర్చడం జరిగింది.ఈ నేపథ్యంలో శనివారం తునిషా గుంటూరు జిల్లా నిడుబ్రోలులో విజయవాడ వైపునకు వెళ్లే ఓ రైలు ఎక్కారు.

* బందరు కాలువలోకి దూకి
అయితే ఒక్కసారిగా తునీషా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. కానీ ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే తునిషా ఎక్కిన రైలు విజయవాడ వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో విజయవాడ పూల మార్కెట్ దగ్గరకు వచ్చింది. అదే సమయంలో బందర్ కాలువలోకి దూకేశారు తునిషా కాలువలో నీటి ప్రవాహానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో కొట్టుకుపోయారు. అయితే అక్కడ ఒక చెట్టు కొమ్మను పట్టుకుని రాత్రంతా అలానే ఉండిపోయారు. ఉదయాన్నే ఆమెను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి బయటకు తీశారు.

* విసిగిపోయిన కుటుంబ సభ్యులు
అయితే గత కొంతకాలంగా ఆమె పరిస్థితి ఇలానే ఉండడంతో కుటుంబ సభ్యులు విసిగిపోయారు. ఆమె కనిపించకపోయేసరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కృష్ణలంక పోలీసులకు ఈమె దొరకడంతో వారు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు విజయవాడ చేరుకున్నారు. అప్పటికే ఆసుపత్రికి తీసుకెళ్లిన బాధితురాలిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.