Homeఆంధ్రప్రదేశ్‌Tomato KG @50 : రూ.50లకే కిలో టమాటా.. ఎగబడుతున్న ప్రజలు

Tomato KG @50 : రూ.50లకే కిలో టమాటా.. ఎగబడుతున్న ప్రజలు

Tomato KG @50 : సరిగ్గా నెల రోజుల కిందట ధర లేకపోవడంతో టమాటాను రహదారులపై పారబోశారు. ఇప్పుడదే టమాటా ధర ఎవరికీ అందనంత దూరానికి ఎగబాకింది. సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ప్రధాన నగరాల్లో రూ.100కుపై మాటే. మరికొన్ని ప్రాంతాల్లో కృత్రిమ కొరత సృష్టించి రూ.150 వరకూ విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సామాన్యులు టమాటా అంటేనే అల్లంత దూరం వెళ్లిపోతున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఉపశమన చర్యలకు దిగింది. సబ్సిడీపై అందించేందుకు సిద్ధపడింది. రోజుకు 50 నుంచి 60 క్వింటాళ్లు సేకరించి రాయితీపై రూ.50లకే అందిస్తోంది. గత మూడురోజులుగా ఈ ప్రక్రియ నడుస్తోంది.

మొన్న బుధవారం  కర్నూలు, కడప జిల్లాల్లో నగరాలు, పట్టణాల్లో మార్కెటింగ్ శాఖ కౌంటర్లు ఏర్పాటుచేసి  రాయితీపై రూ.50లకే కిలో టమాటా అందించారు. ప్రజలు వచ్చి కొనుగోలు చేశారు. ప్రభుత్వ చర్యలపై ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం అదే ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా టమాటాను రాయితీపై అందించేందుకు ముందుకొచ్చింది. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి విక్రయిస్తోంది. దేశ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులే టమాటా ధర పెరుగుదలకు కారణం. దక్షిణాధి రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు, ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కూడా ధర పెరుగుదలకు కారణాలుగా విశ్లేషిస్తున్నారు.

టమాటా మార్కెట్ కు అంతర్జాతీయ స్థాయిలో మదనపల్లె పెట్టింది పేరు. కానీ ప్రతిరోజూ మార్కెట్ కు అరకొరగానే టమాటాలు వస్తున్నాయి.వ్యాపారుల మధ్య విపరీతమైన పోటీ పెరుగుతోంది. అది ధరలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ అధికారులు నేరుగా రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. ప్రతిరోజూ 50 నుంచి 60 టన్నులను సేకరించి ప్రధాన నగరాలకు పంపుతున్నారు. టమాటా ఉత్పత్తులు సాధారణస్థితికి వచ్చే వరకూ సబ్సిడీపై అందించేందుకు ఏపీ సర్కారు నిర్ణయించడం ఉపశమనం కలిగించే విషయం. అయితే కేవలం నగరాలు, రైతుబజార్లకు పరిమితం చేయకుండా మోస్తరు పట్టణాల్లో సైతం టమాటా విక్రయ కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular