AP housing scheme Update: ఏపీ ప్రభుత్వం( AP government) గ్రామీణ ప్రాంత ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కలెక్టర్ల సదస్సులో కీలక అప్డేట్ ఇచ్చింది. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల కోసం 10.42 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. త్వరలో ఇల్ల మంజూరు ఉంటుందని ప్రకటించారు. వచ్చే నాలుగేళ్లలో అర్హులందరికీ ఇల్లు మంజూరు అవుతాయని స్పష్టం చేశారు. ప్రాథమిక స్థాయిలో 2026 ఫిబ్రవరిలో ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం అవుతుందని వివరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెండింగ్లో ఉండిపోయిన 3.10 లక్షలు ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించింది. మరో 5.68 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి కూడా. వీటిని త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు టార్గెట్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.
సొంత స్థలం లేకపోతే..
పేదలందరికీ సొంత ఇల్లు కట్టాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయించింది కూడా. దూరంగా స్థలాలు పొందిన వారు అక్కడ ఇల్లు కట్టడానికి ఇష్టపడకపోతే.. వాటిని రద్దుచేసి నివాసయోగ్యమైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయిస్తారు. ఉన్న స్థలంలోని ఇల్లు కట్టుకుంటామంటే అనుమతిస్తారు. కొత్తగా స్థలం కొనేవారికి, ధరలు ఎక్కువగా ఉన్నచోట జి +3 అంటే నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తారు. ఐదేళ్లలో అర్హులైన ప్రతి పేదవాడికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని చెబుతున్నారు కూటమి పాలకులు.
నివాస యోగ్యత లేని ప్రాంతాల్లో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో జగనన్న కాలనీల పేరిట ఇల్లు మంజూరు చేశారు. కానీ ఊరికి దూరంగా.. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇల్లు మంజూరు చేశారు. దీంతో అక్కడ ఇల్లు నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రాలేదు. అందుకే గత ప్రభుత్వ హయాంలో లక్షలాది ఇళ్ల నిర్మాణ పనులు పెండింగ్లో ఉండిపోయాయి. అయితే కొత్తగా మంజూరు చేయాలంటే ఉన్న వాటిని పూర్తి చేయాల్సిన అవసరం, అనివార్యం కూటమి ప్రభుత్వంపై ఏర్పడింది. అందుకే గత 18 నెలల్లో పెండింగ్ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు హౌస్ ఫర్ హాల్ స్కీం కింద పేదలందరికీ, అర్హులకు ఇల్లు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి దరఖాస్తులను స్వీకరించింది. పది లక్షలకు పైగా దరఖాస్తులు రావడం విశేషమే. అయితే ప్రాధాన్యత క్రమంలో ఫిబ్రవరి నుంచి ఈ ఇళ్ల మంజూరు ప్రక్రియ ఉండనుంది. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.