Kadambari Jethwani  : విద్యాసాగర్ జస్ట్ ఎర.. తెర వెనుక జిందాల్.. కాదంబరి జెత్వాని కేసులో కీలక ట్విస్ట్!

ముంబై నటికి వేధింపులకు గురి చేశారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పుడు ఆమె నేరుగా వచ్చి ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. సమగ్ర విచారణ చేపట్టేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది.

Written By: Dharma, Updated On : August 30, 2024 4:59 pm

Kadambari Jethwani  Case

Follow us on

Kadambari Jethwani : వైసిపి ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరి జెత్వాని ఈరోజు విజయవాడ చేరుకున్నారు. నేరుగా విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం నేపథ్యంలో ఏపీ పోలీసులు స్పందించారు. విచారణను ప్రారంభించారు. ఇప్పుడు బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా అసలైన విచారణను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో ఉన్న వివాదం కారణంగానే కాదంబరి జెత్వానిని వేధించినట్లు వార్తలు వచ్చాయి. పోలీసులు కూడా అలానే భావించారు. కానీ ఇందులో అసలు సిసలు ట్విస్ట్ ఉన్నట్లు సమాచారం. పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. గత వైసిపి ప్రభుత్వం లో జిందాల్ పరిశ్రమ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వ పెద్దలతో వారికి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే ముంబైలో నెలకొన్న వివాదం నేపథ్యంలో సజ్జన్ జిందాల్ పై కాదంబరి జెత్వాని ఫిర్యాదు చేశారు. ఆ వివాదం నేపథ్యంలోనే ఆమె విజయవాడలో వేధింపులకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. బాధితురాలు ఫిర్యాదుతో విచారణ ఊపందుకోనుంది.

* లాయర్ కీలక వ్యాఖ్యలు
బాధితురాలు తరపున నర్రా వెంకటేశ్వరరావు వాదనలు వినిపించనున్నారు. కదంబారి జెత్వాని విజయవాడ వచ్చిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. ముంబైలో జిందాల్ పై పెట్టిన కేసు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేసేందుకే ఆమెను వేధించినట్లు ఆరోపించారు. అందులో భాగంగానే కాదంబరిపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా.. వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను కూడా జైలుకు పంపించిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో విజయవాడ జైల్లో కాదంబరి తో పాటు ఆమె తల్లిదండ్రులు 42 రోజులపాటు రిమాండ్ లో గడిపారని గుర్తు చేశారు.

* మారిన సీన్
బాధితురాలు కాదంబరి విజయవాడలో అడుగుపెట్టడంతో సీన్ మారుతోంది. ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. కుక్కల విద్యాసాగర్ ఎర మాత్రమేనని.. అసలు వ్యక్తులు చాలామంది ఉన్నారని.. సమగ్ర దర్యాప్తు చేపట్టి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఐపీఎస్ అధికారులు ముంబై వచ్చి.. తమను విజయవాడ ఎలా తీసుకువచ్చారో.. ఏ విధంగా ఇబ్బంది పెట్టారో సమగ్రంగా వివరించారు. ముంబైలో తాము పెట్టిన కేసు వెనక్కి తీసుకోమని బెదిరింపులకు దిగారని కూడా ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

* ఏపీ ప్రభుత్వం ఫుల్ ఫోకస్
ఇప్పటికే బాధితురాలు ఏపీ ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తనకు చంద్రబాబు రక్షణ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విషయంలో న్యాయం చేయాలని కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ఆమె సినీ నటి మాత్రమే కాదు.. బాధ్యతాయుతమైన డాక్టర్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత సైతం స్పందించారు. బాధితురాలు కాదంబరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయడం, వివరాలు అందించడంతో సమగ్ర విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.