Floating Bridge: ఇది వైసిపి ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి కథ

సుమారు రూ.1.60 కోట్లతో ఈ బ్రిడ్జిని ప్రైవేటు వ్యక్తితో విఎంఆర్డిఏ అధికారులు ఏర్పాటు చేశారు. నిర్వాహకులు మూడేళ్ల పాటు ఏటా పదిహేను లక్షల రూపాయలు విఎంఆర్డిఏ కు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.

Written By: Dharma, Updated On : February 27, 2024 11:11 am
Follow us on

Floating Bridge: విశాఖ సాగర తీరంలో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయింది. ప్రారంభించిన ఒక్కరోజు వ్యవధిలోనే తెగిపోవడం సంచలనంగా మారింది. తీరం నుంచి సముద్రంలో 100 మీటర్ల పొడవున ఫ్లోటింగ్ డబ్బాలతో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. టీ ఆకారంలో ఉన్న దానిమీద నడుచుకుంటూ వెళ్లి.. చివరన నిలబడి సముద్రాన్ని వీక్షించవచ్చు. అయితే నిలబడి వీక్షించాల్సిన బ్రిడ్జి భాగం తెగిపోయింది. సుమారు 300 మీటర్ల పాటు వెళ్లిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగి పడడానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సుమారు రూ.1.60 కోట్లతో ఈ బ్రిడ్జిని ప్రైవేటు వ్యక్తితో విఎంఆర్డిఏ అధికారులు ఏర్పాటు చేశారు. నిర్వాహకులు మూడేళ్ల పాటు ఏటా పదిహేను లక్షల రూపాయలు విఎంఆర్డిఏ కు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆదివారం ఈ బ్రిడ్జి ను వైసిపి ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పర్యాటకులు అక్కడకు చేరుకున్నారు. పర్యాటకుల తాకిడి సైతం అధికంగా ఉంది. అయితే అక్కడకు ఒక రోజు తరువాత బ్రిడ్జి తెగిపోవడం సంచలనం గా మారింది. అయితే అధికారులు మాత్రం ట్రయల్ రన్ అంటూ చెబుతుండడం విశేషం. ఆ సమయంలో పర్యాటకులు ఎవరూ లేకపోవడం ప్రమాదం తప్పింది. లేకుంటే భారీ మూల్యం తప్పదని స్థానికులు చెబుతున్నారు.

వాస్తవానికి ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటుపై నిపుణులు ముందు నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తీరం చాలా ప్రమాదకరమైనది. నిత్యం సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. తుపాన్లు, ఈదురుగాలుల సమయంలో అలల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అటువంటి చోట ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు ప్రమాదకరమని నిపుణులు సైతం హెచ్చరించారు. అయినా అవేవీ పట్టించుకోకుండా ఈ బ్రిడ్జిని నిర్మించినట్లు తెలుస్తోంది. సోమవారం అలల తీవ్రతకు వంతెన నాలుగు అడుగులు పైకి ఎగిరింది. దీంతో ఎగిరి పడి బ్రిడ్జి తెగిపోయినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నెటిజన్లు సైతం భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.