Tripura: ఆ సింహాలకు పేరు పెట్టడమే పాపమా?

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో సెఫాహిజాలా పేరుతో ఒక జూ పార్క్ ఉంది. అందులో విస్తారంగా సింహాలు ఉంటాయి. ఈ క్రమంలో రెండు సింహాలను ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి లోని బెంగాల్ సఫారీ పార్క్ కు తీసుకొచ్చారు.

Written By: Velishala Suresh, Updated On : February 27, 2024 11:22 am
Follow us on

Tripura: సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటే, అక్రమాలకు పాల్పడితే, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్ అవుతారు. కానీ ఇవేమీ లేకుండా ఓ అటవీ శాఖ ఉన్నతాధికారి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్నాడు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. అడవిలో ఉండే రెండు సింహాలకు పేర్లు పెట్టినందుకు ఆ అటవీ శాఖ ఉన్నతాధికారి పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ పేర్లు పెట్టడం రాజకీయరంగు పులుముకోవడంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది.

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో సెఫాహిజాలా పేరుతో ఒక జూ పార్క్ ఉంది. అందులో విస్తారంగా సింహాలు ఉంటాయి. ఈ క్రమంలో రెండు సింహాలను ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి లోని బెంగాల్ సఫారీ పార్క్ కు తీసుకొచ్చారు. త్రిపుర నుంచి తీసుకొచ్చిన ఒక ఆడ, ఒక మగ సింహాన్ని ఒకటే ఎన్ క్లోజర్ లో ఉంచారు. ఇంతవరకు ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వాటిలో ఆడ సింహానికి సీత పేరు, మగ సింహానికి అక్బర్ అనే పేరు పెట్టడమే వివాదానికి కారణమైంది. సీత అనే ఆడ సింహాన్ని.. అక్బర్ అనే మగసింహంతో ఎలా కలిపి ఉంచుతారని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రశ్నించారు. ఇవి హిందువుల మనోభావాలను కించపరుస్తున్నాయని ఆరోపిస్తూ కోల్ కతా హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు పై విచారణ జరిపిన కోర్టు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ” ఆ సింహాలు ఇక్కడ పుట్టినవి కావు. ఒక సింహం 2016, మరో సింహం 2018 లో పుట్టాయి. వాటికి మేము పేర్లు పెట్టలేదని” పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇచ్చింది.

ఈ వాదనలు విన్న కోల్ కతా హైకోర్టు సింహాల పేర్లు మార్చాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది..ఈ నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ లాల్ అగర్వాల్ ను సస్పెండ్ చేసింది. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రాజధాని అగర్తలా ను వీడి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ప్రవీణ్ లాల్ అగర్వాల్ ఆ సింహాలకు పేర్లు పెట్టారని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ కు ఆ సింహాలను పంపించిన నేపథ్యంలో.. ఆ సింహాలకు పెట్టిన పేర్లు వివాదాస్పదమయ్యాయి. ఇంతటి గొడవకు ప్రవీణ్ లాల్ అగర్వాల్ కారణమని త్రిపుర ప్రభుత్వం భావించి అతడిని విధుల నుంచి సస్పెండ్ చేసింది.. ప్రస్తుతం అటు బెంగాల్ ప్రభుత్వాన్ని, ఇటు త్రిపుర ప్రభుత్వాన్ని రెండు సింహాలకు పెట్టిన పేర్లు ఇబ్బందులకు గురి చేయడం విశేషం.