Amaravati Capital: గత ఐదేళ్ల వైసిపి పాలనలో అమరావతి రాజధాని ( Amaravathi capital )పూర్తిగా నిర్వీర్యం అయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఊపిరి పీల్చుకుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నిధుల సమీకరణ జరిగింది.. జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి కొత్త కళ వచ్చింది. కేంద్రం సైతం 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. వివిధ రకాల ప్రాజెక్టులను సైతం మంజూరు చేసింది. అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. సరిగ్గా ఇదే సమయంలో శాసనమండలిలో ఆసక్తికర చర్చ నడిచింది. అమరావతి విషయంలో తమ పార్టీ స్టాండ్ పై చర్చిస్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సరిగ్గా అదే సమయంలో ఆయనపై ఓ సాధారణ రైతు ఫిర్యాదు చేయడం విశేషం.
Also Read: ఫాఫం.. పోసానిని తిప్పిన చోట తిప్పకుండా తిప్పుతున్నారే?
* తెరపైకి మూడు రాజధానులు..
2019లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు ఉన్న అమరావతి రాజధాని కాకుండా.. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. విశాఖను పాలన రాజధానిగా చేసి.. అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేయాలని భావించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఐదేళ్లలో ఆ పని కూడా సజావుగా పూర్తి చేయలేకపోయింది. నాన్చుడు ధోరణితో ముందుకు సాగింది. అదే సమయంలో అమరావతి రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. గత ఐదేళ్లుగా అంతులేని నిర్లక్ష్యం కొనసాగింది. అదే సమయంలో అప్పటి వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ అమరావతి రైతుల గుండెల్లో గుచ్చుకున్నాయి. వాటిపైనే తాజాగా బొత్స పై ఫిర్యాదులు వస్తున్నాయి.
* వరుసగా కేసులు
రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. మరోవైపు సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ కూడా జరిగింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అమరావతి రైతుల మనోభావాలను దెబ్బతీసేలా.. బొత్స సత్యనారాయణ మాట్లాడారంటూ అమరావతి రైతు ఒకరు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో బొత్స సత్యనారాయణ అమరావతి రాజధానిని స్మశానంతో పోల్చారు. అప్పట్లో రైతులు పోరాట బాట పట్టినా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే శాసనమండలిలో అమరావతి రాజధానిపై చర్చ జరిగిన నేపథ్యంలో.. ఏకంగా బొత్స సత్యనారాయణ పై అమరావతి రైతు ఫిర్యాదు చేయడం విశేషం.